India Cleansweep The T20 Series Against New Zealand :
న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మూడవ మ్యాచ్ లో ఇండియా 73 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇండియా విసిరిన 184 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లు రాబట్టి కివీస్ పతనానికి నాంది పలికాడు. మిగిలిన బౌలర్లు కూడా పదునైన బంతులతో కివీస్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. కివీస్ ఆటగాళ్ళలో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఒక్కడే 51 పరుగులతో రాణించాడు. మిగిలిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీనితో 17.2 ఓవర్లలో 111 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో అక్షర్ కు మూడు, హర్షల్ పటేల్ కు రెండు, యజువేంద్ర చాహల్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్ లకు తలా ఒక వికెట్ దక్కింది.
న్యూజిలాండ్ తాత్కాలిక టి 20 కెప్టెన్ టిమ్ సౌతీకి విశ్రాంతి ఇచ్చారు, అతని స్థానంలో మిచెల్ శాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి రోహిత్ శర్మ ఇండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 69 పరుగులు జోడించారు. ఇషాన్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ మరోసారి విఫలమై డకౌట్ గా వెనుదిరిగాడు, రిషభ్ పంత్ కూడా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా రాణించి 31బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్-25; వెంకటేష్ అయ్యర్-20 పరుగులు చేశారు. చివర్లో హర్షల్ పటేల్-18, దీపక్ చాహర్-21 వేగంగా పరుగులు రాబట్టి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు…బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఫెర్గ్యుసన్, ఇష్ సోది తలా ఒక వికెట్ పడగొట్టారు.
మూడు ఓవర్లలో కేవలం తొమ్మిది పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించగా, రోహిత్ శర్మకు ప్లేయర్ అఫ్ ద టోర్నీ దక్కింది.
రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన తొలి సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేయడం విశేషం.
Also Read : రెండో మ్యాచ్ లోనూ విజయం: ఇండియాదే సిరీస్