బాలీవుడ్ సుప్రసిద్ధ సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ గుండెపోటుతో మరణించారు. అయన వయసు 78 సంవత్సరాలు. ‘నేటి తెల్లవారుజామున 2 గంటలకు మా తండ్రి గారు గుండెపోటుతో మరణించారు’ అని రాం లక్ష్మన్ కుమారుడు అమర్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే కోవిడ్ వాక్సిన్ రెండో డోసును లక్ష్మణ్ తీసుకున్న కొద్ది రోజులకు నీరసం, అలసటకు గురై వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు.
‘మై నే ప్యార్ కియా’; ‘హమ్ ఆప్కే కౌన్’; ‘హమ్ సాత్ సాత్ హై’ లాటి శతదినోత్సవ చిత్రాలకు అయన స్వరాలు సమకూర్చారు. అయన మృతిపై సుప్రసిద్ధ గాయని, భారత రత్న లతా మంగేష్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయన సంగీత దర్శకత్వంలో పాడిన ఎన్నో పాటలు తనకు మంచి పేరు తెచ్చాయని, అయన మరణ వార్త జీర్ణించుకోలేక పోతున్నానని లతా మంగేష్కర్ తన సందేశంలో పేర్కొన్నారు.
రాం లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. రామ్ లక్ష్మణ్ పేర్లలో లక్ష్మణ్ విజయ పాటిల్ కాగా ‘రామ్’ ఆయన స్నేహితుడు సురేంద్ర. సంగీత దర్శకుడిగా ఎదిగే క్రమంలో తనను ప్రోత్సహించి సహకరించిన మిత్రుడు సురేంద్రను కలుపుకొని ‘రాం లక్ష్మణ్’ అనే పేరుతో సినిమాలకు స్వరాలు సమకూర్చడం ప్రారంభించారు. అయితే 1976 లో ‘ఏజెంట్ వినోద్’ సినిమా ఒప్పుకోగానే సురేంద్ర మరణించారు, అయినా సరే తన మిత్రుడి జ్ఞాపకార్ధం రామ్ లక్ష్మణ్ పేరుతోనే కొనసాగారు.
రాం లక్ష్మణ్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.