Junior Hockey:
జూనియర్ హాకీ జట్టు ఈసారి కూడా విజయం సాధించి తమ ట్రోఫీ నిలబెట్టుకుంటుందని భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ ధీమా వ్యక్తం చేశారు. హాకి జూనియర్ వరల్డ్ కప్ రేపటి (నవంబర్ 24) నుంచి ప్రారంభం కానుంది. ఇండియాలో హాకీ పేరు చెప్పగానే ఠక్కున గుర్చుకొచ్చే రాష్ట్రం ఓడిశా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలోనే మొత్తం మ్యాచ్ లు జరగనున్నాయి, రేపు మొదలయ్యే ఈ వరల్డ్ కప్ డిసెంబర్ 05 వరకూ జరుగుతుంది.
‘ఎఫ్.ఐ.హెచ్. ఓడిశా హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ భువనేశ్వర్ 2021’ పేరిట నిర్వహిస్తున్న ఈ టోర్నీకి మనదేశం కుర్రాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు. డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్నారు. జర్మనీ కూడా తగంలో ఆరు సార్లు ఈ కప్ గెల్చుకొని ఫేవరేట్ గా బరిలో ఉంది. ఇండియా, జర్మనీ తో పాటు బెల్జియం, నెదర్ల్యాండ్స్, స్పెయిన్, అర్జెంటీనా, పాకిస్తాన్, సౌత్ కొరియా తో సహా మొత్తం 16 దేశాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి.
గత రెండు నెలలుగా బెంగుళూరులో మన జూనియర్ జట్టు ముమ్మర సాధన చేస్తోందని, యువకుల ఆటతీరు బ్రహ్మాండంగా ఉందని, సీనియర్ జట్టుగా తాము రెండు మ్యాచ్ లు వారితో ఆడామని, ఒకదాంట్లో తమను ఓడించారని మన్ దీప్ వెల్లడించాడు. మన జూనియర్లు ఈసారి కూడా తప్పకుండా ఫైనల్స్ కు చేరుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, రేపటి నుంచి జరిగే ఈ మెగా టోర్నీకి సర్వం సన్నద్ధం అయ్యింది. ఇండియా ప్రారంభం రోజున జరిగే తన మొదటి మ్యాచ్ లో ఫ్రాన్స్ తో తలపడనుంది.