Kodali Nani-Jr. NTR :
జూనియర్ ఎన్టీఆర్ కు తమకు ఏమి సంబంధమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. తాను, వల్లభనేని వంశీ, జూనియర్ ఒకప్పుడు కలిసి ఉన్నమాట వాస్తవమేనని, విభేదాలు రావడంతో ఎవరి దారిలో వారు పయనం చేస్తున్నామని, తాము వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ లో ఉన్నామని నాని వివరించారు. జూనియన్ ఎన్టీఆర్ చెబితే వినటానికి తాము ఆయనకు నిర్మాతలుగానో, దర్శకులుగానో పనిచేయడం లేదని స్పష్టం చేశారు. సంబంధం లేనివారిని కూడా వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని నాని మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో వంశీతో కలిసి కొడాలి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, భువనేశ్వరిలపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఆశించినంతగా లేదని, తన శిష్యులైన కొడాలి నాని, వంశీలకు అయన ఘాటుగా హెచ్చరికలు పంపి ఉండాల్సిందని టిడిపి నేత వర్ల రామయ్య నేడు విజయవాడలో వ్యాఖ్యానించారు. భువనేశ్వరికి సంఘీభావంగా రామయ్య తన భార్యతో కలిసి 12 గంటల దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా జూనియర్ పై రామయ్య విమర్శలు గుప్పించారు. వీటిపై మీడియా కొడాలి నానిని స్పందన కోరగా అయన టిడిపి నేతలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కోసం తాము ఏమైనా చేస్తామని, అయన చెప్పకపోయినా చేస్తామని నాని ప్రకటించారు.
ఎన్టీఆర్ కుటుంబం అంటే అందరికీ గౌరవం ఉందని, సిఎం జగన్ సైతం వారిని గౌరవిస్తారని నాని చెప్పారు. వారిని అమాయకులను చేసి తన వైపుకు తిప్పుకొని, అన్నగారినే విమర్శించేలా చంద్రబాబు చేయగలిగారని కొడాలి గుర్తు చేశారు. భువనేశ్వరిపై ఎవరూ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, కేవలం చంద్రబాబే ఆమెను అల్లరి చేస్తున్నారని, రాజకీయ అవసరాలకోసం భార్యను సైతం రోడ్డు మీద పెట్టగలిగిన వ్యక్తి ఒక్క చంద్రబాబేనని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డిని వేధించిన వారు సోనియా గాంధీ నుంచి చంద్రబాబు, లోకేష్ వరకూ అందరూ సర్వ నాశనం అయిపోయారని నాని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డితో పోరాడలేక భార్యను అడ్డం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడే చంద్రబాబు అయన పతనమయ్యారని ధ్వజమెత్తారు. తమకు భద్రత పెంచిన విషయంపై కూడా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారని, తాము ఏనాడూ భద్రత కోరుకోలేదని చెప్పారు. ఎలాంటి భద్రత లేకుండా బాబు ఇంటిముందు నుంచి వెళతానని, అలాగే బాబు కూడా తన భద్రత వదిలి రాగలరా అని కొడాలి ప్రశ్నించారు.