Kohli miss one-day series:
సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూరమైన మర్నాడు మరో కీలక పరిణామం జరిగింది. వన్డే సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు, ఈ విషయం అధికారికంగా ఇంకా వెలువడలేదు కానీ… కుటుంబంతో సమయం గడిపేందుకు జనవరిలో తనకు కొంత విరామం కావాలని కోహ్లీ అడిగిన మాట వాస్తవమేనని బిసిసిఐ అధికార వర్గాలు వెల్లడించాయి. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డే లు ఆడనుంది. టీమిడియా జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్నాడు. టెస్టు జట్టును గతవారం బిసిసిఐ సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది. టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ తొడ కండరాల నొప్పి కారణంగా సిరీస్ కు దూరమయ్యాడు.
ఇండియా- సౌతాఫ్రికా మధ్య డిసెంబర్ 26-30 వరకూ తొలి టెస్ట్; 2022 జనవరి 3-7 వరకూ రెండో టెస్ట్, 11-15 వరకూ మూడో టెస్ట్ జరగనున్నాయి. జనవరి 9న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల గారాలపట్టి వామిక మొదటి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కోహ్లీ విరామం… మూడు టెస్ట్ లు అయిన తర్వాత ఉంటుందా, లేక రెండో టెస్ట్ పూర్తయిన తర్వాతే వెళతారా అనేది తెలియాల్సి ఉంది.
కోహ్లీ సారధ్యంలో జరిగే టెస్ట్ సిరీస్ కు రోహిత్; రోహిత్ సారధ్యంలో జరిగే వన్డే సిరీస్ కు కోహ్లీ అందుబాటులో లేకుండా పోవడం భారత క్రికెట్ అభిమానుల మదిలో పలు రకాల ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయన్న వార్తలకు ఇది బలం చేకూరుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read : టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ ఔట్!