Investigative Journalism:
మీడియాలో ఏ వార్తకు అదే ప్రత్యేకం. ఒక వార్తతో ఇంకో వార్తను పోల్చుకోకూడదు. ఒకే సంఘటనకు సంబంధించిన వార్త ఒక్కో దిన పత్రికలో ఒక్కోలా రావడాన్ని కూడా పాఠకులు ఏనాడో అర్థం చేసుకున్నారు. ఒక్కోసారి ఒకే పత్రికలో ఒక గంభీరమయిన ప్రశ్న ఒక వార్తగా వస్తే…దానికి సమాధానంగా అదే పత్రికలో పేజీ తిప్పగానే మరో వార్త ఉంటుంది. ఇది కాకతాళీయంలా వార్తతాళీయం అనుకోవచ్చు. అలా ఒక పత్రికలో ప్రశ్న- సమాధానంగా రెండు వార్తలను కలిపి చదువుకోవాల్సిన ఒక సందర్భం ఏర్పడింది.
జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద ఎంతో శోధించి, శ్రమతో ఒక పరిశోధనాత్మక కథనం రాశారు. దాన్ని “బ్లడ్ సాండర్స్” పేరుతో పుస్తకంగా ముద్రించారు. ఆ పుస్తకాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వర్చువల్ గా ఆవిష్కరించారు. జర్నలిజంలో కంట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టిన జస్టిస్ ఈ సందర్భంగా పరిశోధనాత్మక జర్నలిజం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పత్రిక తిరగేస్తే ఏదో ఒక పరిశోధనాత్మక కథనం ఉండేదని, ఇప్పుడు ఎంత వెతికినా ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈవార్త చదివి…నిట్టూర్చి…పేజీ తిప్పగానే…కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఒక విలేఖరిని ఏంది బే! మెదడు లేదా? అంటూ చెంప మీద కొట్టబోయిన…జర్నలిస్టులను దొంగలు అని దూషించిన వార్తను చదవాల్సి వచ్చింది.
సాహిత్యంలో అన్వయం చాలా ప్రధానం. ఒక మాటకు ఎన్నెన్నో అర్థాలుంటాయి. కవి/రచయిత ఆ మాటను ఏ అర్థంలో ప్రయోగించాడో? ఏ కార్య కారణ సంబంధంతో ఆ మాటను అక్కడ బంధించాడో? ఏ క్రమంలో దాన్ని అన్వయించుకోవాలో? తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే పైపైన మాటల అర్థానికే పరిమితమైపోతాం. మహత్వ- కవిత్వ- పటుత్వ సంపద అన్న పోతన స్తుతిలో ప్రాస ఒక్కటే వెతుక్కునేవారు కొందరు. సంస్కృత బీజాక్షరాలకు తెలుగు పర్యాయపదాలుగా వాటిని అన్వయించుకునేవారు కొందరు. సాహితీ విద్యార్థులకు-విమర్శకులకు ఈ అన్వయబాధలు తప్పవు.
పత్రికల సామాన్య పాఠకులు ఈ స్థాయిలో మాటల మధ్య దాగిన అర్థాలను అన్వయించుకోవాల్సిన అవసరం ఉండదు. బ్లాక్ అండ్ వైట్లో అన్నీ అరటిపండు ఒలిచిపెట్టినట్లు స్పష్టంగా, తేలిగ్గా ఉండాలి. అలా జస్టిస్ ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి సమాధానమిస్తున్నట్లుగా అన్వయం చక్కగా కుదిరింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న- సమాధానాన్ని క్రమాలంకారంలో పూరించుకోవడం పాఠకుల వంతు!
ప్రశ్న: పరిశోధనాత్మక వార్తలు ఎందుకు తగ్గిపోయాయి?
సమాధానం: ప్రభుత్వం కొడుతుంది కనుక.
ప్ర:పరిశోధనాత్మక జర్నలిస్టులు ఎందుకు తగ్గిపోయారు?
స: ప్రభుత్వం ఎస్ యు వి లతో తొక్కించి చంపుతుంది కనుక.
ప్ర: పరిశోధనాత్మక జర్నలిజం కనిపించదెందుకు?
స: ప్రభుత్వ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు దాడులు చేస్తాయి కనుక.
ప్ర: పరిశోధనాత్మక జర్నలిస్టులకు దిక్కెవరు?
స: దిక్కూ లేనివారికి దేవుడే దిక్కు!
ప్ర: పరిశోధనాత్మక జర్నలిజంలో ఫలితాలేమిటి?
స: రాసిన విలేఖరికి ప్రాణ గండం; ఉద్యోగ గండం; అడుగడుగునా గండాలు.
ప్ర: ఆధునిక పరిశోధనాత్మక జర్నలిజం మాటకు నిర్వచనమేమిటి?
స: మేనేజ్మెంట్ కు నచ్చనివారి లోపాలను మాత్రమే శోధించి రాయడం.
ప్ర: పరిశోధనతో అంతిమ ఫలితం?
స: పరివేదన!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : తమిళ తెరపై దళిత వసంతం