I am very exciting : Nani
న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
నేను మామూలుగానే థియేటర్‌లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమాను చూస్తుంటాను. రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగ రాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమాలో అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు.
ఇలాంటి కథకు మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. అలా అంతా కలిసి వచ్చినప్పుడు తెరపై ఆ ఫీల్‌ను తీసుకుని రాగలం. ఏవో సెట్లు వేశాం కాబట్టి పీరియడ్ సినిమా చూసినట్టుగా అనిపించదు. మీరే ఆ కాలంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఇలా ప్రొడక్ట్ మొత్తం పూర్తయిన తరువాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సినిమా పట్లా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కమల్ హాసన్ నాయకుడు.. ఈ సినిమాకు సంబంధం ఉండదు. కానీ కమల్ గారి అభిమానిని అవ్వడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథ పరంగా ఎక్కడా పోలిక ఉండదు. శ్యామ్ సింగ రాయ్ కోసం ప్రత్యేకంగా వెయిట్ పెరగడం వంటివి ఏం చేయలేదు. కానీ మీకు అలా అనిపిస్తుంది. నడిచే విధానం, మాట్లాడే తీరును బట్టి ఆ తేడాను మనం చూపించొచ్చు.
శ్యామ్ సింగ రాయ్ పోరాటం చెడు మీద. చెడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. అప్పట్లో ఉండే దురాచారాలపై కమ్యూనిస్ట్ అయిన శ్యామ్ ప్రేమలో పడితే.. అతను ఎలా మారుతాడు అనేది సినిమా. శ్యామ్ సింగ రాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ. ఇది పూర్తిగా కల్పితం. ఇప్పుడు వరుసగా సినిమాలున్నాయి. ఈ సమయంలో కాస్త గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత ప్రమోట్ చేసినా మొదటి ఆట వరకే. ఆ తరువాత సినిమానే చూసుకుంటుంది. అయినా మాకు ఈ సినిమా ఎలా వచ్చిందో తెలుసు. ఎంతో నమ్మకంగా ఉన్నాం. అంటే సుందరానికీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఏప్రిల్ వచ్చే అవకాశం ఉంది. దసరా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ యాసను తెలంగాణ వారి కంటే స్పష్టంగా పలుకుతాను. ప్రస్తుతం నా చేతిలో అంటే సుందరానికీ, దసరా సినిమాలున్నాయి.
Also Read : నేను కనిపించను – దేవదాసి పాత్రే కనపడుతుంది : సాయి పల్లవి