India Vs SA: సెంచూరియన్ టెస్ట్ పై ఇండియా పట్టుబిగిస్తోంది. నిన్న రెండోరోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా మూడోరోజు ఇండియా బౌలింగ్ లో సత్తా చాటి సౌతాఫ్రికాను 197 పరుగులకే కట్టడి చేసింది. తొలిరోజు మూడు వికెట్లకు 272 పరుగులు చేసిన ఇండియా మరో 55 పరుగులు జోడించి 327కు ఆలౌట్ అయ్యింది. కెఎల్ రాహుల్ తొలి రోజు చేసిన స్కోరుకు మరో పరుగు మాత్రమే జోడించి 122కు రబడ బౌలింగ్ లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. రహానే 48 చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బుమ్రా మాత్రమే 14 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి ఆరువికెట్లు తీసుకోగా, రబడ మూడు, మార్కో జాన్ సేన్ ఒక వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికాను మొదటి ఓవర్లోనే బుమ్రా దెబ్బ తీశాడు. ఓపెనర్, కెప్టెన్ ఎల్గార్(1) ను అవుట్ చేశాడు. జట్టులో బావుమా(52), డికాక్(34), రబడ(25) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో రాణించాడు. బుమ్రా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు, సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నారు.
మూడో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టాపోయి 16 పరుగులు చేసింది.
Also Read : రాహుల్ సెంచరీ; పూజారా విఫలం