నటసార్వభౌమ నందమూరి తారకరామావు జయంతి ఈ రోజు (మే 28). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్నఇచ్చినట్టు.. మన తెలుగుతేజం దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ’’ అని ట్వీట్ చేశారు చిరంజీవి.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమకు రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలకుగానూ.. భారతరత్నతో సత్కరించాలని పలువురు ప్రముఖులు కొంతకాలంగా కోరుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్టీఆర్ శతజయంతి రాబోతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనడంతో… ఈ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.