Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏదీ నాటి తెలుగు వైభవం?

ఏదీ నాటి తెలుగు వైభవం?

Telugu in Ads: ఇప్పుడంటే వాణిజ్య ప్రకటనల్లో తెలుగుకు గోచీ గుడ్డ కూడా మిగల్లేదు కానీ- అర్ధ శతాబ్దం కిందటి ప్రకటనల్లో తెలుగు తెలుగుగానే ఉండేది. కవితాత్మకశైలిలో చక్కటి, చిక్కటి తెలుగు ఉండేది. వాక్యంలో కర్త, కర్మ, క్రియ అన్వయం కుదిరి చదివిన వెంటనే అర్థమయ్యేది. సాంకేతిక విషయాలను కూడా అరటి పండు ఒలిచిపెట్టినట్లు సులభంగా చెప్పే ప్రయత్నం ఉండేది.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలుగు సంస్కృతికి సొంతమయిన సంగీత, నాటకాభివృద్ధికి ఒక అకాడెమీ ఉండేది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆ సంగీత నాటక అకాడెమీ బతికి ఉండేది. ఎందుకో అన్నకు నచ్చలేదు. అకాడెమీలకు మంగళం పాడి- తెలుగు యూనివర్సిటీకి ప్రాణం పోశాడు. అన్ని కళల అకాడెమీలను మింగి పుట్టిన తెలుగు యానివర్సిటీ– ఆ కళలకు ఎంత దోహదం చేసిందో కలలో కూడా మనం అనుకోకూడదు.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగయ్య ద్విశత జయంతి ఉత్సవాల సందర్భంగా 1967లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ నాట్యకళ ప్రత్యేక సంచికను ప్రచురించింది. సంగీత, సాహితీ దిగ్గజాలయిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పి ఎస్ ఆర్ అప్పారావులాంటి వారిచేత రాయించిన వ్యాసాలు ఈ సంచికలో ఉన్నాయి. కర్ణాటక సంగీత ప్రియులు, తెలుగు భాషాభిమానులు కలకాలం దాచుకోదగ్గ పుస్తకమిది. వాగ్గేయకారుడిగా త్యాగయ్యకు సంబంధించిన అనేక విషయాలకు ఇది రెఫెరెన్స్ గా పనికివచ్చే పుస్తకం.

ఈ ప్రత్యేక సంచికలో అనేక వాణిజ్య ప్రకటనలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ, జాతీయ బ్యాంకుల, ప్రయివేటు కంపెనీల ప్రకటనలవి. పుస్తకంలో త్యాగయ్య సంగీత, సాహిత్యాల మీద ఎంత అధికారమయిన రచనలున్నాయో- ప్రకటనలన్నీ కూడా అంతే హుందాగా, అందంగా, తెలుగుదనం నింపుకుని ఉన్నాయి. అన్ని యాడ్స్ గురించి రాస్తే మళ్లీ అదో పుస్తకమవుతుంది కాబట్టి మచ్చుకు రెండు ప్రకటనలు చూద్దాం. అందులో ఒకటి నాగార్జునసాగర్ ఆనకట్ట మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. మరొకటి పైన లోడ్ బరువు లారీ టైర్ల మీద పడకుండా రక్షించే స్ప్రింగ్ ప్లేట్ల ప్రయివేట్ వాణిజ్య ప్రకటన.

మానవ మహోన్నత దేవాలయం- సాగర్

“1955, డిసెంబరు నెలలో మంచు కురుస్తున్న ఒకానొక ప్రాతః కాలం;
పరవళ్లు తొక్కే పురాతన కృష్ణా నదీ జలాల సద్వినియోగం;
మానవ బృహత్ ప్రయత్నానికి నాంది;
ప్రపంచంలో అతి పెద్ద రాతి ఆనకట్ట;
భారతదేశపు వైభవోజ్వల చరిత్రకూ- రానున్న కాలంలో సుందర భవిష్యత్తుకూ వజ్రాల వంతెన- నాగార్జునసాగర్

ప్రభుత్వ ప్రకటనల్లో ఇప్పుడు ఇలాంటి కండగల, గుండెగల నిండుతెలుగు మెండుతెలుగు చూడగలమా? వినగలమా?
ప్రకటనలో తెలుగు వజ్రాల వంతెన నిర్మించిన అప్పటి ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ కు కోటి దండాలు.

పెద్ద బరువులను మోసిన సరళమయిన తెలుగు

పంజాబ్- యమునానగర్ ఫ్యాక్టరీలో తయారయ్యే లారీ స్ప్రింగ్ ప్లేట్ల ప్రకటన ఇది. కచ్చితంగా అనువాదమే అయి ఉంటుంది. కానీ- పూర్తి సాంకేతిక విషయాన్ని ఎంత సరళంగా, స్పష్టంగా, నేరుగా చెప్పారో?

ఎగుడు దిగుడు కచ్చా రోడ్లపై కుదుపుల్లేకుండా, ఎంత బరువునయినా తట్టుకుని ఎన్ని వేల మైళ్లయినా ప్రయాణించడానికి ఈ స్ప్రింగులు పనిచేస్తాయట. ఏ రకం ట్రక్కుకైనా చక్కగా, నమ్మకంగా పనిచేస్తాయట. జై స్ప్రింగు కుషన్ లారీకే కాక- తెలుగు భాషకు కూడా మెత్తటి శయ్యగా అమరింది.

ఒకప్పుడు తెలుగును తెలుగులో అలోచించి తెలుగులో రాసేవారు. దాంతో విషయమేదయినా ఇలా చదవగానే అలా అర్థమైపోయేది. ఇప్పుటి ప్రకటనల్లో తెలుగు కథ కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది.

ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో తెలుగు దేవాతావస్త్రం!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అన్నంతో ఆరోగ్యం వయా కుక్కర్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్