Own house to MIG: రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ ఉద్దేశంతోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇప్పటికే పంపిణీ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయని వెల్లడించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ వెబ్‌సైట్‌ను క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్థలాలు కేటాయించి వారి సొంతింటికలను సాకారం చేస్తోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ)వారికి అనువైన ధరల్లో లిటిగేషన్లకు తావులేని స్ధలాలు కేటాయిస్తోంది.
ఈ పథకంలో మూడు కేటగిరీలలో స్ధలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎంఐజీ –1 కింద 150 గజాలు, ఎంఐజీ –2 కింద
200 గజాలు, ఎంఐజీ –3 కింద 240 గజాలు ప్రతి లేఅవుట్‌లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని సిఎం వివరించారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైయస్సార్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ లేఅవుట్‌లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని, ఈ ఆరు జిల్లాలే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు రాబోయే రోజుల్లో ప్రతి నియోజవర్గంలో ఈ పథకం విస్తరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. దీని ద్వారా ప్రతి నియోజకవర్గం కేంద్రంలో మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి ఉత్పన్నమవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న పీఆర్సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఎం వీ రామమనోహరరావు, ఎంఐజీ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ బసంత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read :సిఎం జగన్ కు వారికోత్సవ ఆహ్వానం