ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించింది. ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలతో ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, తమ బలం ఎలా నిరుపించుకోవాలో తెలియక రాజకీయ పార్టీల్లో అలజడి నెలకొంది.
ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనలతో ప్రచార తీరు తెన్నులు మారే అవకాశాలు ఉన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహణ వచ్చే నెల కూడా జరిగే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో ఓటరు మహాశయుని ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు పంచె అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ , గోవా మణిపూర్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మద్యం, డబ్బుల పంపిణి పెద్ద ఎత్తున ఓటర్లను ప్రభావితం చేయనుంది.