Friday, September 20, 2024
HomeTrending Newsపాక్ పై తాలిబాన్ తిరుగుబాటు

పాక్ పై తాలిబాన్ తిరుగుబాటు

Taliban : పాకిస్తాన్ – తాలిబాన్ల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్ళు తాలిబన్లకు కవచం మాదిరిగా ఉన్న పాకిస్తాన్ అదే ముసుగులో ఆఫ్ఘనిస్తాన్ కు అన్యాయం చేస్తోందనే అనుమానం తాలిబన్లలో బలపడుతోంది. తాజాగా రెండు దేశాల మధ్య డ్యురాండ్ రేఖ సరిహద్దు వివాదం,పంజాబ్ రాష్ట్రంలో తెహ్రిక్-ఏ-తాలిబాన్ హింసాత్మక చర్యలతో పాక్ – ఆఫ్ఘన్ ల మధ్య దూరం పెరుగుతోంది. ఆకలి బాధలు భరించలేక, వైద్య సహాయం కోసం సరిహద్దులు దాటి వస్తున్న ఆఫ్ఘన్ ప్రజల విషయంలో పాకిస్తాన్ దౌర్జన్యంగా నడుచుకుంటూ, శరణార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని తాలిబాన్ ఆక్రోశంతో ఉంది.

 

Taliban

ఆఫ్ఘన్ లోని తూర్పు నంగార్హర్ రాష్ట్రంలో రెండు దేశాల మధ్య సరిహద్దు డ్యురాండ్ రేఖ ఫెన్సింగ్ ను పాక్ బలగాలు తొలగించటం, దాన్ని అడ్డుకునే క్రమంలో తాలిబాన్ వర్గాలు దురుసుగా వ్యవహరించటం గొడవకు కారణమైంది. ఫెన్సింగ్ ఏకపక్షంగా తొలగించటం, పైగా దాన్ని స్థానిక సమస్యగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని తాలిబాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఇనయతుల్ల ఖ్వరజ్మి ఆరోపించారు.

అధికారం కైవసం చేసుకొని ఆరు నెలలు గడిచిపోయినా అంతర్జాతీయంగా ఏ దేశం కూడా తాలిబన్లను గుర్తించ లేదు. ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వ గుర్తింపు కోసం పాక్ సహకరించటం లేదని, ఎలాంటి చొరవ తీసుకోవటం లేదని, కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందనే అనుమానం ఆఫ్ఘన్ ప్రజలు, తాలిబన్లలో బలపడుతోంది. 90 ల్లో నజీబుల్లా ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్న నాటి నుంచి ఆఫ్ఘన్ ప్రజలు పాక్ తో స్నేహంపై విముఖంగానే ఉన్నారు. ఆఫ్ఘన్ లో అస్థిరతకు పాక్ స్వార్థ ప్రయోజనాలే కారణమని భావిస్తున్నారు.

పంజాబ్, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రాల్లో ఇటీవల తెహేరిక్ –ఏ-తాలిబాన్ కార్యకలాపాలు ఉదృతం అయ్యాయి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిటిపి హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. టిటిపి మీద కొద్ది రోజుల క్రితం నిషేధం ఎత్తివేయగా మతపరమైన కార్యక్రమాలు, ప్రజల సమస్యల మీద గళం విప్పుతోంది. అది కాస్త ఇటీవల దక్షిణ వజిరిస్తాన్ లోని బజౌర్ జిల్లాలో ఏడుగురు పాక్ సైనికుల ప్రాణాలు హరించే స్థాయికి చేరుకుంది. టిటిపి పూర్తిగా ఆఫ్ఘన్ తాలిబాన్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. పాక్ లో దాడులు చేయటం ఆఫ్ఘన్లో తలదాచుకోవటం టిటిపి సాయుధ కమాండోలు చేస్తున్నారు. వీరిని కట్టడి చేయటంలో తాలిబన్లు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పాకిస్తాన్ గుర్రుగా ఉంది. తెహేరిక్-ఏ-తాలిబాన్ సాయుధులను అదుపులో ఉంచకపోతే ఆఫ్ఘన్ భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తామని పాక్ భద్రత సలహాదారు మొయిద్ యూసుఫ్ వారం రోజుల క్రితం హెచ్చరించారు.

 

Taliban

టిటిపిలో పష్టున్ తెగవారే ఎక్కువగా ఉంటారు. ఇందులో పనిచేసేవారికి కార్యక్షేత్రం ఆఫ్ఘనిస్తాన్ కాగా వారి కుటుంబాలు ఖైభర్ పఖ్తుంఖ్వ రాజధాని పెషావర్, స్వాత్ లోయలో ఎక్కువగా ఉంటారు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళినట్టుగా ఆఫ్ఘన్లో వివిధ ముస్లిం అతివాద గ్రూపుల్లో పష్టున్ లు పనిచేస్తుంటారు.  ఆంగ్లేయుల కాలంలో పష్టున్ లను రెండు గా విడగొట్టి కొంత ఆఫ్ఘన్ లో ఉండగా మరో ప్రాంతం పాకిస్తాన్ లో ఉంది. పాక్ పంజాబ్- భారత్ పంజాబ్ మాదిరిగా జరిగింది. పాక్ ప్రభుత్వంలో మొదటి నుంచి పంజాబ్ రాష్ట్ర నేతలదే ఆధిపత్యం నడుస్తోంది. మొదటి సారిగా ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఉన్నా తమకు  సంక్షేమ ఫలాలు అందటం లేదనే బాధ పష్టున్ ప్రజల్లో ఉంది. ధైర్య సాహసాలకు మారుపేరుగా చెప్పుకునే పష్టున్ లను కేవలం మతోన్మాద కార్యక్రమాలకు, జిహాది గ్రూపుల్లో పనిచేయటానికి పాక్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నిరక్షరాస్యత అధికం, ప్రభుత్వంలో, ఉద్యోగాల్లో పష్టున్ ల ప్రాతినిధ్యం బహు తక్కువగా ఉంది.

 

బలోచ్ ప్రజలకు మద్దతుగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ – పష్టున్ ప్రజలకు మద్దతుగా ఉండే టిటిపి లోపాయికారిగా ఏకమై ఇటీవల పాక్ సైన్యం మీద ముప్పేట దాడులు చేస్తున్నాయి. బలోచ్-పష్టున్ ప్రజలతో పాటు సింద్ ప్రాంతంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ మూడు ప్రాంతాల ప్రజలు తిరుగుబాటు ధోరణిలో మాట్లాడుతున్నారు.  బలోచ్ ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తుంటే, పష్టున్లు స్వయం ప్రతిపత్తి కోసం ఆరాటపడుతున్నారు. సింద్ ప్రజలు అభివృద్దిలో తమకు న్యాయమైన వాటా దక్కటం లేదనే కోపంతో ఉన్నారు. అసంతృప్తి ఇదే తీరుగా కొనసాగితే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సమస్యలు పెరుగుతాయి.

-దేశవేని భాస్కర్

Also Read : తాలిబాన్ల పాలనతో ప్రజల ఇక్కట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్