Perni Fire: సినీ నటుడు మోహన్ బాబుతో తన భేటిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర రవాణా, ఐ అండ్ పి ఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. మోహన్ బాబుతో తనకు 20 ఏళ్ళనుంచి వ్యక్తిగతంగా పరిచయం ఉందని, కాఫీ కోసం పిలిస్తే వారి ఇంటికి వెళ్లానని వెల్లడించారు. తమ మాటల సందర్భంగా సినిమా వ్యవహారాలు చర్చకు వచ్చాయని, కానీ దీనిపై కూడా కొందరు వక్ర భాష్యాలు చేయడం దుర్మార్గమన్నారు. నిన్న సిఎంతో జరిగిన సమావేశానికి మోహన్ బాబు రాకపోవడంతో ఆయనకు వివరణ ఇవ్వటానికి వెళ్లానంటూ ఏవేవో విపరీతార్ధాలు తీస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం తరఫున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్ని స్పష్టం చేశారు. సినిమా రంగ సమష్యలపై నేడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అయన తీవ్రంగా తప్పుబట్టారు. టిక్కెట్ల సమస్య సృష్టించిందే చంద్రబాబు అని, బ్లాక్ టిక్కెట్లతో ప్రజల్ని దోచుకునే సంప్రదాయానికి తెరతీసింది కూడా ఆయనేనని ఆరోపించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి అసలు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. సినీ రంగ సమస్యలను సిఎం జగన్ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సినిమా వారిని రాజకీయాలకు వాడుకోవటం తప్ప చంద్రబాబు వారికి ఏమీ చేయలేదని నాని దుయ్యబట్టారు.
నిన్న చర్చలకు వచ్చిన సినిమా వాళ్లకు మా పార్టీతో ఏమైనా సంబంధం ఉందా? అని నాని నిలదీశారు. ఇక్కడకి వచ్చిన వారెవరికీ మా పార్టీలో సభ్యత్వం లేదన్నారు. సినిమా రంగ సమస్యలు పరిష్కరించటమే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారానికి వారంతా సంతోషించారన్నారు.
Also Read : ఇలా కూడా చేయవచ్చా? : చంద్రబాబు