కరోనా మొదలయ్యాక దేశ ప్రజల ఆహార అలవాట్లు బాగా మారాయి. ఇదివరకు రోజులో రెండుసార్లు తినేవారు ఇప్పుడు రోజంతా ఏదో ఒకటి తింటున్నారు. కొన్ని ఆరోగ్యం కోసం. మరికొన్ని ఆనందం కోసం. వీటిలో చిరు తిండికి పెద్దపీట. పేరుకే తప్ప నిజానికి ఇవే పెద్ద మొత్తంలో తింటారు.
పొద్దున్న లేచింది మొదలు నోరు ఆడుతూనే ఉంటుంది చాలా మందికి. పిల్లల సంగతైతే చెప్పక్కరలేదు. కరకరా కుర్కురే,లే లెమ్మని లేస్ చిప్స్ నమిలేస్తూ ఉంటారు.
చిరుతిళ్ళు ఈ నాటివి కావు. ఒకప్పుడు చేగోడీలు, కారప్పూస, మిఠాయిలు అరుదుగా మధ్యాహ్నం తినేవారు. లేదా వేడిగా పకోడీలు, బజ్జిలు వేసుకునేవారు.
ఇప్పటికీ వీటికి డిమాండ్ ఉన్నా రెడీమేడ్ స్నాక్స్ కే ఎక్కువ మార్కెట్. కరోనా మొదలయ్యాక లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లో ఉండటంతో చిరుతిళ్లు 46 శాతం ఎక్కువ తింటున్నారని అంతర్జాతీయంగా చేసిన ఒక సర్వే లో తేలింది.
వీరిలో 88 శాతం పెద్దవాళ్లేనట. అందులోనూ రెడీమేడ్ చిప్స్ లాంటివి ఎక్కువ తింటున్నారట. దానితో జూలు విదిల్చిన అనేక విదేశీ కంపెనీలు పరిస్థితి తమ చేతుల్లోకి తెచ్చుకుంటున్నాయి.
భారత్ లాంటి దేశాల్లో రెండు శాతం జనాభా ఈ ఫుడ్స్ కొన్నా కంపెనీల పంట పండినట్టే. జస్ట్ గుడ్ ఫుడ్, మంచ్ బాగ్, స్నాక్ స్టార్, బ్రిటిష్ కార్నర్ షాప్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లను ముంచెత్తబోతున్నాయి.
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రకటనలు ఇస్తున్నాయి కూడా. ఇప్పటికే బర్గర్లు, పీజ్జాలు, చిప్స్ .. యువతరాన్ని, సంపన్న, మధ్యతరగతిని వశం చేసుకున్న నేపథ్యంలో కొత్త ఉత్పత్తులు ఇంకెంత చేటు చేస్తాయోనని ఆహార నిపుణుల ఆందోళన.
‘పొగతాగడం ప్రమాదకరం అని టొబాకో ఉత్పత్తులపై ముద్రించినట్టే చిప్స్, చాకోలెట్స్ , కూల్ డ్రింక్స్ ఉత్పత్తులపై కూడా ఆరోగ్యానికి హానికరమని ఉండాల’ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివెకర్ అభిప్రాయం.
ఒకపక్క ఇంటి ఆహారమే అన్నిటికీ మందంటూ మరోపక్క అడ్డదిడ్డంగా విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్న ప్రభుత్వాల తీరు ఆందోళనకరం.
ఉందిలే మంచింగ్ కాలం ముందుముందునా అని ముంచుకొస్తున్న అంతర్జాతీయ కంపెనీలను ఏ నందనందనుడు ఆపగలడో?
-కె. శోభశ్రీ