Jagdevpur Gandhi : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పనిచేస్తున్న సమయంలో ఆయన వద్దకు ఒక పాత మిత్రుడు వచ్చాడు. ఆయనతో- ఏమయ్యా బాగున్నావా! రావడమే మానేశావని ఆలింగనం చేసుకుని ఎంతోఆప్యాయంగా పలకరించాడు. ఆ వచ్చిన వ్యక్తి చిన్ననాటి నుండి మిత్రుడు, ఆత్మీయుడు, మెదక్ జిల్లా జగదేవపూర్ అనే గ్రామానికి సర్పంచ్‌గా పనిచేస్తున్న నరసింహరామయ్య పంతులు.
నరసింహరామయ్య పంతులుగారితో – ఇంకా ఎంత కాలం ఈ సర్పంచ్‌గిరి చేస్తావు? నా వద్దకు వచ్చేయ్! ఎమ్మెల్సీగా నీ సేవలు ఈ రాష్ట్రానికి కావాలి అని, ఎంతో ప్రేమతో అడిగారు. అందుకు నరసింహరామయ్య గారు, ఎంతో గౌరవంతో, చిరునవ్వుతో – అన్నయ్యా! నా ఊరే నాకు సర్వస్వం. నా గ్రామ ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. నా జీవితాంతం గ్రామ సర్పంచ్‌గా నా ఊరి అభివృద్ధికే పనిచేస్తాను. నాకు ఇంకే పదవులు వద్దు. దయచేసి మా గ్రామాభివృద్ధికి కొంత సహాయమందించు. అదే నాకు గొప్ప సాయం’’ అంటూ వారి యొక్క ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎమ్మెల్సీ పదవిని ఇవ్వజూపిననూ, సున్నితంగా తిరస్కరించిన మహోన్నత వ్యక్తి ఆదరాసుపల్లి నరసింహరామయ్య పంతులు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని జగదేవపూర్ గ్రామానికి నలభై ఏళ్ళ పాటు సర్పంచ్‌గా పనిచేసి, జనం మెచ్చిన నేతగా, జగదేవపూర్ గాంధీగా ప్రసిద్ధి గాంచారు నరసింహరామయ్య పంతులు. చేతిలో ఒక చిన్న సంచి, ఖద్దరు ధోవతి, లాల్చీ ధరించి, నిరాడంబర జీవితాన్ని సాగించి, ఆదర్శ నాయకుడిగా, ఉత్తమ సర్పంచ్‌గా ప్రజాభిమానాన్ని చూరగొని, నాటి, నేటి, రేపటి తరానికి మార్గదర్శకులుగా నిలిచారు నరసింహరామయ్య పంతులు. తన సొంత ఆస్తులను సైతం ప్రజోపయోగ అవసరాల కోసం వెచ్చించి, జీవితాంతం ప్రజాసేవలోనే నిమగ్నమైన వ్యక్తి వీరు.
యాభయ్యేళ్ళ క్రితమే తన గ్రామంలో జూనియర్ కళాశాల అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయించడమే కాకుండా, తదుపరి మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయించడంలోనూ వీరు ఎంతో కృషి చేసి సాధించారు. నాటి ముఖ్యమంత్రులు పి.వి. నరసింహారావు, వెంగళరావు, చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో ఎంతోమంది ప్రముఖుల నుండి గౌరవ మన్ననలు పొందిన ఉత్తమ సర్పంచ్‌గా ఖ్యాతి పొందిన నరసింహరామయ్య పంతులు నిర్యాణం రోజు ఊరూరూ కదలి వేలాదిమంది వారి అంతిమయాత్రలో పాల్గొని నివాళి ఘటించడం ఒక చిరస్మరణీయ ఘట్టం. వారి 17వ వర్థంతి సందర్భంగా వారి అభిమానులంతా కలసి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఈ నెల 16న గ్రామంలోని ప్రధాన రహదారిపై ప్రతిష్టించబోతున్నారు. ఈ నెల 16వ తేదీ బుధవారం 10.30 గం.లకు జరుగుతున్న మహత్కార్యక్రమంలో ప్రముఖులు, అభిమానులు, శిష్యులు పాల్గొననున్నారు.