Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవాల్మీకి రాయని లేపాక్షి వేరుశెనగ పురాణం!

వాల్మీకి రాయని లేపాక్షి వేరుశెనగ పురాణం!

కదిరి- లేపాక్షి 1812 కొత్త వేరుశెనగ వంగడం గుత్తులు గుత్తులుగా భలే కాస్తోంది చూడు అని జర్నలిజంలో నా క్లాస్ మేట్ ఒక వీడియో పంపి నా బలహీనత మీద దెబ్బకొట్టాడు. దాంతో ఒక్కసారిగా కాల చక్రాన్ని యాభై ఏళ్లు వెనక్కు తిప్పాల్సి వచ్చింది.

లేపాక్షి చరిత్ర ఎంత రాసినా ఇంకా ఎంతో రాయాల్సింది మిగిలే ఉంటుంది. లేపాక్షి ఆలయంలో వినగలిగే చెవులుంటే రాళ్లు నోళ్లు విప్పి తమ చరిత్రను తామే చెప్పుకోవడం స్పష్టంగా వినపడుతుంది. కళ్లు మూసుకున్నా సోయగాలతో కదిలి వచ్చే శిల్పాలు కనిపిస్తూనే ఉంటాయి. అంతటి ఆలయంలో ఆడుతూ పాడుతూ పెరిగిన నాకు, లేచి వచ్చే లేపాక్షి బసవయ్య మూపున ఎక్కి మేఘాల్లో తేలిన నాకు కించిత్ గర్వం ఉండడాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందే.

పదో తరగతిదాకా మేము ఆడుకున్న దాగుడు మూతలకు రాతికి లతలు మొలిచి పిలిచే స్తంభాలే అడ్డు. గుడి ప్రాకారాల్లో తిరిగి తిరిగి అలసి తాగిన నీళ్లు సీతమ్మ పాదముద్రతో రాతిలో ద్రవించిన ఊట. కింద కాగితం పెట్టి ప్రతిసారీ ఆశ్చర్యపోయిన చోటు వేలాడే స్తంభం. నాట్య మండపం మధ్యలో మా నాన్న అష్టావధానాలు చేస్తుంటే తెలిసినవే- దత్తపదులు;
నిషిద్ధాక్షరులు; సమస్యాపూరణలు; అశువులు; అప్రస్తుత ప్రసంగాలు.

వాలీ బాల్, బ్యాడ్మింటన్, సాఫ్ట్ బాల్, కోకోలు ఆడుతుంటే మాకు రెఫరీ నిలువెత్తు లేపాక్షి బసవయ్య. ఎగరేసిన గాలి పటాలకు రక్షణ నంది చూపు. పోటీలు వేసుకుని, మోకాలి చిప్పలకు గాయాలు చేసుకుని మేమెక్కిన కొండ జటాయువు వాలిన చోటు.

అప్పట్లో లేపాక్షి బసవయ్య వేరుశెనగ పొలాల మధ్యే ఉండేవాడు. లేపాక్షి గుడి వెనక కనుచూపు మేర వేరుశెనగ పంటే. వేరు శెనగ పండే నేలను అక్కడ దిన్నె/దిన్ను అంటారు. వేరుశెనగను రాయలసీమలో శనక్కాయ, చెనిక్కాయ, చనక్కాయ అనే అంటారు. ఒకప్పుడు వేరుశెనగ, మల్బరీ, చెరుకు తోటలు తప్ప ఇంకేమీ కనిపించేవి కాదు.

పొలంలో వేరు శెనగ పెరికి, మట్టి దులిపి, అక్కడే నాలుగు పుల్లలు వేసి మంటలో కాల్చుకుని తినాలంటే పూర్వజన్మల పుణ్యఫలం ఉండాలి. ఇంటికి తెచ్చుకుని నీళ్లలో కడిగి, ఉడకబెట్టుకుని ఒలుచుకుని, కొత్తిమీర కారంతో నంజుకుని తినాలంటే అదృష్టం ఉండాలి. బెల్లం ముక్క పక్కన పెట్టుకుని ఉడకబెట్టిన పల్లీలు తినాలంటే జిహ్వకు రాసి పెట్టి ఉండాలి. పెద్ద బాణలిలో ఇసుక వేసి, ఆ ఇసుకలో పల్లీలను వేయించుకుని తినాలంటే పెట్టి పుట్టాలి.

వేరుశెనగ పెరికి మోపులు కట్టి ఎడ్ల బండ్లకెత్తి ఇళ్లకు తీసుకువస్తుంటే ఆ దారంతా పల్లీతెమ్మెరలుగా పరచుకునే పచ్చి వాసన పీల్చడానికి కూడా యోగం ఉండాలి. వేరుశెనగ చట్నీ, పొడి, ఉండలు, చిక్కీలు… తినకుండా పెరిగితే వారిని భగవంతుడు కూడా కాపాడలేడు.

లేపాక్షిలో మా జిల్లా పరిషత్ హై స్కూల్లో కిటికీలు ఉండేవి కానీ- కిటికీలకు తలుపులు ఉండేవి కావు. ఉండాలని కూడా మాకెప్పుడూ అనిపించలేదు. ఏ కిటికీలోనుండి తొంగి చూసినా బుద్ధిగా, లైన్లు లైన్లుగా పెరిగే వేరుశెనగ పంటలే.

రామాయణ కాలంలో రావణుడి దెబ్బకు జటాయువు రెక్క తెగి పడింది లేపాక్షి ఆలయానికి కొద్ది దూరంలోనే. సీతాన్వేషణలో రాముడు వచ్చేదాకా ఊపిరి బిగబట్టి, రాముడికి ఆ వార్త చెప్పి, రాముడి ఒడిలోనే కనుమూసిన చోటుగా ఇప్పటికీ ఒక ఆలయం ఉంది. అప్పుడు రాముడు జటాయువును లే! పక్షి! అంటేనే- ఈ ఊరికి లేపాక్షి అని పేరొచ్చింది.

ఆ సమయంలో రాముడు ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఇక్కడి వేరుశెనగక్కాయలు కూడా ఖచ్చితంగా తినే ఉంటాడు. కాకపోతే వాల్మీకి రాసి ఉండకపోవచ్చు. వాల్మీకి రాయనివి ఎన్నో తరువాత కాళిదాసాదులు ఎందరో రాశారు. ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు.

అలా రాయాల్సిన చరిత్ర లేపాక్షిది. లేపాక్షి వేరుశెనగది. క్షమించాలి- శెనక్కాయలది.
“నంది పర్వతజాత నవ పినాకినీ జలము
నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె;
లేపాక్షి బసవయ్య లేచిరవయ్యా!
కైలాస శిఖరిలా కదలి రావయ్యా!”
అని పరవశించి గానం చేసిన అడవి బాపిరాజు ఒక్కడే నంది కాలి స్పర్శతో పునీతమయిన అక్కడి మట్టి పరిమళంలో మహిమను దర్శించగలిగాడు.

లేపాక్షి నంది స్నానం చేయడంతో పొరుగున కర్ణాటక నంది హిల్స్ లో పుట్టి హిందూపురం మీదుగా ప్రవహించే పెన్న నిలువెల్లా పులకించిందట. లేపాక్షి నంది తొక్కడంతోనే అక్కడి నేలల్లో వేరు శెనగ పులకించి వేరు వేరులో నందిని పేరు పేరునా తలచుకుంటోంది. నందిలో రాతిని చూస్తే – పెన్నలో కన్నీళ్లే కనిపిస్తాయి. ఆకాశగంగకై అర్రెత్తి చూసే నందిని చూస్తేనే పెన్నలో పొంగేటి పాల్కడలి గంగ కనిపిస్తుంది.

“సరికొత్త వేరుశెనగ వంగడం కదిరి లేపాక్షి 1812” పేరుకు తగ్గట్టుగా కదిరి నరసింహుడి కరుణతో, లేపాక్షి బసవడి కాలి గిట్టల స్పర్శతో ఇబ్బడి ముబ్బడిగా గుత్తులు గుత్తులుగా పండుతోంది. ఇలాగే కలకాలం అధిక దిగుబడిని ఇస్తూనే ఉండాలని కోరుకుంటూ…

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్