Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతలలు బోడులైన.. తలపులు బోడులౌనా?

తలలు బోడులైన.. తలపులు బోడులౌనా?

Old is gold:
పేదరికం,  దరిద్రం లాంటి అరిష్టాలు..
ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాల వంటి ఉపద్రవాలు,
మనస్తాపం, చిత్త చాంచల్యం లాంటి ధృడ మనోవికారాలు,
కాలుష్యం, కరోనా వంటి గత్తరలు.. మధ్యలో తగులుకోకపోతే మనిషి అనే ప్రతివాడు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.. అనే మూడు దశలను అనుభవించి చావవలసిందే.

ఇక దీంట్లో బాల్యం, వృద్ధాప్యం అంతా ఆధారపడ్డ బ్రతుకే..

ఇక యవ్వనం లోకి రాగానే.. మనిషి వర్తమానం మాత్రమే శాశ్వతం అనే చిత్త భ్రమ కు గురి అయ్యి..

కొత్తగా కొమ్ములొచ్చినట్లు భావించడం, భావోద్వేగాలను బహిరంగంగా ప్రదర్శించడం మామూలే.

మరీ నూత్న యవ్వనంలో ఉన్నప్పుడు.. యువ రక్తం నరాలలో ఉరకలు వేస్తున్నప్పుడు.. బాల్యం లో ఉన్నవారు అజ్ఞానులు గానూ, వృద్ధాప్యం లో ఉన్నవారు చాదస్తులుగానూ కనిపించడం కద్దు.

బాల్యం లో ఉన్నవారిని అజ్ఞానులుగా పరిగణించి వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల “బాలురు” పెద్ద ఫీల్ అవ్వక పోగా, వీళ్ళనే అజ్ఞానులుగా పరిగణించి వాళ్ళ ఆటలలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. కాబట్టి పొయ్యేది ఏమి లేదు.

ఎటొచ్చి వృద్ధాప్యంలో ఉన్నవారే తమని చాదస్తులుగా కొట్టివేయడాన్ని కాస్త జీర్ణించుకోవడం కష్టమై మనసును కష్టపెట్టుకొంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళు “అహంకరించే ఆ యవ్వనాన్ని” దాటి వృద్ధాప్యంలోకి రావడమే.

సరే ఈ వృద్ధులలో చాల రకాలు ఉంటారనుకోండి..
జ్ఞాన వృద్ధులు, భావ వృద్ధులు, వయో వృద్ధులు, దర్శ వృద్ధులు (అంటే వృద్ధులు గా కనబడే వారు) అలా..
ఈ మిగతా వృద్ధులు కాస్తో, కూస్తో గౌరవంగానే బ్రతికినా, ఈ వయో వృద్ధులదే దీన పరిస్థితి.

జ్ఞానేంద్రియాల పనితీరు మందగించడం, కర్మేంద్రియాలపై పట్టు సడలడం, మెదడు వేగంగా స్పందిచకపోవడం ఈ వృద్ధాప్యంలో అనివార్యం కావడంతో.. యవ్వనంలో ఉన్నవారికి వీరు “అనవసర బాధ్యత” అనిపించడం కలిధర్మం.

కాని వృద్ధాప్యం లో ఉన్నవారిని అంత పనికిరానివారు గా చూడవలసిన అవసరం లేదని, వారి జీవిత అనుభవాల సారాన్ని.. కాస్త ఓపికగా వెలికితీసి “యవ్వనంలో ఉన్నవారు” ఒంట పట్టించుకొంటే..
వారి “యవ్వనం” ఒక పక్క వారికి, మరో పక్క జాతికి ప్రయోజనకారి అవుతుందని.. జ్ఞాన వృద్ధులు అనేక పరిశోధనలు చేసి సశాస్త్రీయంగా ఘోషిస్తున్నారు.

తలలు బోడులైన వారిని పనికిరానివారుగా, చాదస్తులుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని.. తలలు బోడులైనంత మాత్రాన వారి తలపులు బోడులు కావని.. వారి మస్థిష్కం లో “తెల్ల గుజ్జు” పెరిగి వారికీ బావోద్వేగాలపై అదుపు, విషయ సమన్వయ సామర్ధ్యం,  కచ్చితత్వం, సృజనాత్మకత పెరిగి.. వారు మెదడును పరిపూర్ణంగా ఉపయోగించే స్థాయికి ఈ వృద్ధాప్యం లోనే చేరుకుంటారని ఈ నవీన పరిశోధనలు తెల్చేస్తున్నాయట.

“ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని ఏండ్లు మీరిన వాడు వృద్ధుడా ”.. అని “చిన్నయసూరి” పంచతంత్రంలో ఈసడించినా..
జ్ఞాన వృద్ధులతో పాటు, వయో వృద్ధులలో కూడా ఈ సామర్ధ్యాలు దండిగానే ఉంటాయని భావించాలి.

“ మా కురు ధన జన యవ్వన గర్వం, హారతి నిమేషాత్కాలః సర్వం” అని ఆదిశంకరులు ఏనాడో చెప్పినట్లు.. ఈ “యవ్వనం” ఎంతో కాలం ఉండదు. కాలం హరించివేస్తుంది. తాము వృద్దాప్యం లోకి పోవలసిందే.

కాబట్టి వృద్ధులను పట్ల ఉపేక్ష మాని, కాస్త వాళ్ళ బుర్రలోని “అనుభవాల గుజ్జు” ను ఉపయోగించుకోగలిగితే.. మనకు, తద్వారా సమాజానికి మేలు జరుగుతుందని “యవ్వనులు” గ్రహిస్తారని ఆశిద్దాం.

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ దినవహి

Also Read :

ఇది మెంటల్ వేళయని!

Also Read :

కునుకుపడక మెదడు కాస్త కుంటు పడతది!

RELATED ARTICLES

Most Popular

న్యూస్