Friday, September 20, 2024
HomeTrending Newsరష్యా వీటో పవర్...వీగిన తీర్మానం

రష్యా వీటో పవర్…వీగిన తీర్మానం

ఉక్రెయిన్ పై రష్యా  దండయాత్రను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భద్రతామండలిలోని ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. మరో శాశ్వత సభ్య దేశం చైనా, తాత్కాలిక సభ్య దేశాలు భారత్, యు.ఏ.ఈ వోటింగ్ కు దూరంగా ఉన్నాయి.  ఇక మొదటి నుంచి ఉక్రెయిన్, రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్ భద్రతామండలి కూడా అదే వైఖరి అవలంభించింది. చర్చల ద్వారానే సమస్య పరిష్కరించగలమని ఐక్యరాజ్య సమితి  భద్రాతామండలి సమావేశంలో భారత్ స్పష్టం చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నివారణకు సంప్రదింపులే మార్గమని, దౌత్యపరమైన చర్చలు ప్రారంభించి శాంతి స్థాపనకు రెండు దేశాలు ముందుకు రావాలని భారత్ పిలుపు ఇచ్చింది.

రష్యాను ఏకాకి చేయాలని భావించిన అమెరికా – అల్బేనియాతో కలిసి ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సెక్యురిటి కౌన్సిల్ లో వీగిపోయినా 193 సభ్యదేశాలు ఉన్న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో (జనరల్ అసెంబ్లీ)లో మరో ముసాయిదా ప్రవేశపెడతామని అమెరికా ప్రకటించింది. రష్యా వీటో అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ..యుద్దానికి పూర్తిగా రష్యాదే బాధ్యతా అని 50 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భద్రతామండలి అధ్యక్ష స్థానంలో ప్రస్తుతం రష్యా ఉంది. అందుకే రష్యా దాడికి దిగినట్టు ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి.

తీర్మానం వీగి పోవటంపై యుఎన్ లో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ ఉద్వేగంగా మాట్లాడారు. రష్యా తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రష్యా ఈ తీర్మానాన్ని విటో చేసి ఉండవచ్చు కానీ.. ఉక్రెయిన్ ప్రజల గొంతులను విటో చేయలేదని వ్యాఖ్యానించారు. తన దేశ ప్రజల నిరసనలను రష్యా వీటో చేయలేదని.. యుఎన్ చార్టర్ ను వీటో చేయలేదని… నేటి యుద్దానికి రష్యా ఇప్పుడు, ఎప్పటికి జవాబుదారిగా ఉండాల్సిందేనని… నిజాన్ని విటో చేయలేరని ఐరాసలో యూఎస్ రాయబారి చెప్పుకొచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్