ఈశాన్య రాష్ట్రం.. మణిపుర్‌లో ఈ రోజు జరిగిన తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం మూడు గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కోవిడ్ పాజిటివ్ ఉన్నవారి కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు వోటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 5 జిల్లాల పరిధిలోని 38 స్థానాల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 15 మంది మహిళలు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. తొలివిడతలో సీఎం బీరేన్ సింగ్, ఉపముఖ్యమంత్రి జాయ్‌కుమార్ సింగ్ లతో పాటు పీసీసీ అధ్యక్షుడు లోకేశ్ సింగ్ కూడా బరిలో ఉన్నారు. హెయిన్ గాంగ్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం బీరేన్ సింగ్ ఈ దఫా ఐదోసారి గెలిచేందుకు తీవ్ర స్థాయిలో శ్రమించారు. మణిపూర్‌లోని 60 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 5న మణిపుర్‌లో 22 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక ఎన్నికల పోరు విషయానికి వస్తే.. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, జనతాదళ్ తదితర పార్టీలు సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీల కంటే అభ్యర్థులకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా ఉన్న సైన్యానికి ప్రత్యేక అధికారాల చట్టం.. మణిపూర్ రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకపాత్ర పోషిస్తోంది. నాగాలాండ్‌లో ఇటీవల ఉగ్రవాదులుగా పొరపడి సాధారణ పౌరులను ఆర్మీ కాల్చిచంపిన ఘటన మణిపూర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది.