యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది . ఆరో విడత ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎస్పీ అభ్యర్థి కాన్వాయ్ పై ఈ రోజు దాడి జరిగింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కారుపై ఖుషీనగర్ లో రాళ్ల దాడి జరిగింది. తన కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు.
ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్‌నగర్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి గురువారం మార్చి 3వ తేదీన ఆరో విడతగా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తన వాహనం కాకుండా వేరే వాహనంలో కూర్చోవడం వల్లే దాడి నుంచి తప్పించుకున్నట్లు మౌర్య తెలిపారు. బీజేపీ మాజీ ఎంపీ స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె సంఘమిత్ర మౌర్య కూడా తన తండ్రి కాన్వాయ్‌పై దాడిని ఖండించారు. ఘటనా స్థలానికి వెళుతున్న తన కాన్వాయ్‌ను కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు.
మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్‌పై జరిగిన ఘటనను అఖిలేష్ యాదవ్ ఖండించారు. మిగిలిన రెండు ఎన్నికల్లో బీజేపీ సున్నా సీట్లకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. యూపీ అసెంబ్లీకి ఏడు విడతలుగా ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.