Petro Price Hike :
త్వరలోనే వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ ధరల మోత మోగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు రేపటితో (సోమవారం) ముగియనున్నందున, చమురు మార్కెటింగ్ కంపెనీలు వచ్చే వారంలోనే పెట్రో ధరల పెంపునకు తెరలేపుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2021 నవంబరు 3న ఎక్సైజ్ సుంకాన్ని లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై ₹10 తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి చమురు మార్కెటింగ్ సంస్థలు రిటైల్ ధరలను సవరించలేదు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ముడిచమురు ధర 111 డాలర్లను మించినందున.. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు లీటరుకు 10 రూపాయలు మించవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పెట్రోలు ధర సుంకాలన్నింటితో కలిపి ₹120- 125కి చేరే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ నుంచి రావల్సిన వంటనూనే సరఫరా నిలిచిపోవటంతో ఇప్పటికే వాటి ధరలు పెరిగాయి. ఈ దఫా పెట్రో ధరలు పెంచితే అన్ని రకాల నిత్యావసరాలు భగ్గుమనే అవకాశం ఉంది.