అది త్రేతాయుగం: ఎవరయినా తనకు ఒక ఉపకారం చేస్తే వారు ఎదురుపడ్డ ప్రతిసారీ రాముడు కృతజ్ఞతతో తలచుకుని తలచుకుని పొంగిపోయేవాడట. వంద అపకారాలు చేసినవారు ఎవరయినా ఎదురుపడితే పొరపాటునకూడా కాలర్ పట్టుకుని నిలదీయడట.
“కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి ! న స్మరతి అపకారాణాం శతమఽపి ఆత్మవత్ తయా” అని వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని చాలా ప్రత్యేకమయిన గుణంగా చెప్పాడు. కథంచిత్ అంటే అనుకోకుండా చేసిన ఉపకారానికయినా అని.
సనాతన ధర్మంలో దానధర్మాలు చాలా ప్రధానమయినవి. ధర్మ దానాలు అని లేదు వరుస. దానమే ముందుంది. ఎంతో కొంత దానం, సహాయం చేయడమే ధర్మం. దానం దానికదిగా ఒక ధర్మం.
“తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు…వెళ్లిపోయెడి నాడు వెంటరాదు…లక్షాధికారయిన లవణమన్నమే కానీ…మెరుగు బంగారంబు మింగబోడు…” అని పరులకు సహాయం చేయకపోతే కూడబెట్టుకున్న బలసంపదలకు విలువే లేదు పొమ్మన్నాడు నృసింహ శతకంలో కవి శేషప్ప.
చేయి చాచినవాడు శ్రీమహా విష్ణువు. ఆయనకు దానమిస్తూ నా చేయి పైన ఉంటుంది. ఇంతకంటే నా జన్మకు ఏమి కావాలి? రాజ్యం గీజ్యం పొతే పోనీ పొమ్మన్నాడు బలి చక్రవర్తి కులగురువు శుక్రాచార్యుడితో.
హిందూ ధర్మంలో దానం తీసుకునేవారు, సహాయం పొందేవారు సాక్షాత్తు దైవ స్వరూపాలు. దేవుడు ఆ రూపంలో సహాయం చేయడానికి మనకొక అవకాశం ఇచ్చినట్లు. ఇంకా లోతుగా వెళితే పాపపుణ్యాల ప్రస్తావనలు, అంతకుమించిన తాత్విక ధర్మ సూత్రాలు చాలా ఉంటాయి. అవి ఇక్కడ అనవసరం.
“కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వా
రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా!”
ఇది కూడా బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో అన్న మాటే. పోతన భాగవతంలో అన్నీ మంత్రమయమయిన పద్యాలే. అందులో ఆణిముత్యం లాంటి పద్యమిది. మన పురాణాలనిండా ఇలాంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఆ విలువలు, ఆదర్శాలను మనం పాటించాలనే పురాణ ప్రవచనకారులు అహోరాత్రాలు చెబుతూ ఉంటారు.
ఇది కలియుగం…. చేసిన సహాయం ఏదయినా రికార్డ్ కావాలి. రిజిస్టర్ కావాలి. మీడియాలో రావాలి. నలుగురికీ తెలియాలి. సహాయం పొందినవారు సహాయం చేసిన వారికి జేజేలు కొట్టాలి. పొగడాలి. మహాదాతల ఔదార్యాన్ని మీడియా గొట్టాల ముందు మెచ్చుకోవాలి. మీడియా కెమెరాల సాక్షిగా సహాయాన్ని ఒక ఘనకార్యంగా చెప్పుకోవాలి. నలుగురు చెప్పుకునే మహత్కార్యంగా మలచాలి. చావుదప్పి కన్నులొట్టబోయి బతుకు జీవుడా అంటూ ఎగిరివచ్చినవారు…ఎవరు సంకల్పిస్తే…ఎవరు సహాయం చేస్తే…ఎవరు ఆనతిస్తే…ఎగిరి రాగలిగారో…విమానం గుమ్మంలో ఇస్తున్న గులాబీ కొమ్మ సాక్షిగా తెలుసుకోవాలి.
కవి శేషప్పలు, బలి చక్రవర్తులు ఎంతగా గొంతు చించుకున్నా…అంతటి శ్రీరాముడే ఒకే ఒక్క సహాయానికి వెయ్యిసార్లు జై కొట్టాడు. ఇంతటి అల్పులం మనం. అంతటి సహాయాలకు ఎన్ని లక్షల సార్లు జై కొట్టాలి?
నిస్సహాయులమయిన మనం సహాయాలకు రుణపడి ఉండాల్సిందే.
సహాయం చేసినవారికి కీర్తి ఇవ్వాల్సిందే.
విమానం దిగిన ప్రతిసారీ కొడుతూనే ఉందాం!
గులాబీ కొమ్మ కనపడిన ప్రతిసారీ కొడుతూనే ఉందాం!
-పమిడికాల్వ మధుసూదన్
ఇవి కూడా చదవండి: