Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకండిగ్రీలు అమ్మబడును!

డిగ్రీలు అమ్మబడును!

Certificates in Market: చదువుకోవడం వేరు, చదువుకొనడం వేరు. ఇప్పుడు చదువుకునేవారికంటే.. చదువు కొనేవారి సంఖ్యే అధికం. ఎప్పుడొచ్చామన్నది కాదు- బుల్లెట్ దిగిందా లేదా? అంతే మ్యాటర్! ఎవడికి కావాలి బట్టీ చదువులు… అన్నేసి సబ్జెక్టులు మెదడులో సేవ్ చేసుకుని పడే కష్టాలు? ఎవ్వడు చూశాడు నువ్వెంత కష్టపడ్డావో? నువ్వెంత నిష్ణాతుడివన్నది? ఉద్యోగావసరాలకై ఒకవేళ అలాంటి క్రాస్ చెకింగ్స్ ఉన్నా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఎలాగూ ఉన్నాయి కదా! అందుకే ఇప్పుడు చదువుకోవడం కంటే చదువు కొనడానికే మొగ్గుచూపుతున్న వారి సంఖ్య.. అందుకు అనులోమానుపాతంలో చదువు నేర్పేవారి కంటే సర్టిఫికెట్ల రూపంలో అమ్మేవారి సంఖ్యే అధికస్య అధికం. ఈమధ్య మన హైదరాబాద్ పోలీసులు అలాంటి ముఠాను అరెస్ట్ చేశాక ఈ ముచ్చటోసారి చెప్పుకోవాల్సిన సమయమిది.

न चोरहार्यं, न च राजहार्यं, न भ्रात्रुभाज्यं, न च भारकारि ।
व्ययेक्रुते वर्धते एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥

న చోరహార్యం, న చ రాజహార్యం, న భ్రాత్రుభాజ్యం, న చ భారకారి ।
వ్యయేకృతే వర్ధతే ఏవ నిత్యం, విద్యాధనం సర్వధన ప్రధానం ॥

ఇది దొంగ సర్టిఫికెట్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చి మార్కెట్ లో అమ్మకానికొస్తున్న వేళ అస్సలు చెప్పుకోకూడని భర్తృహరి సుభాషితం. కానీ, ఓసారి చెప్పుకోకపోతే విద్య విలువ తెలియదు కాబట్టి చెప్పాల్సిన సమయమే సుమా!

Education can not be taken away by thief, can not be taken away by the King. Education is a wealth that is extremely important of all the properties.

విద్య ఏ దొంగ చేతనూ అపహరింపబడలేదు. ప్రభుత్వపరమయ్యేదీ కాదు. పోనీ, సోదరుల మధ్య విభజనకి కూడా గురికాని ఆస్తి. ఏ లాకర్స్ లోనో, నేలమాళిగల్లోనో దాచి భద్రపర్చాల్సిన మోయలేని భారమూ కాదు. ఇతరులకి పంచుతున్నకొద్దీ.. పంచేవాని విజ్ఞానాన్ని వృద్ధిచేసే తరగని ఆస్తి విద్య. సర్వదానాల్లోకెల్ల్లలా విద్యా దానానికి అందుకే అంత ప్రాధాన్యం” ఇదీ భర్తృహరి సుభాషితానికి స్థూలమైన ప్రతిపదార్థం!

కానీ, ఈ భర్తృహరి సుభాషితాలు ఎవడికి కావాలి? విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న వివేకానందుడి నినాదమెవ్వరికి అవసరం? అందుకు పూర్తి విభిన్నం ఈ దొంగ సర్టిఫికెట్ల బాగోతం! a+b హోల్ స్క్వేర్ ఫండమెంటల్స్ తెలీకున్నా… అయానిక, సమయోజనీయ బంధాలతో బంధం లేకున్నా… పైథాగరస్ సిద్ధాంతాలు, ఆర్కెమెడీస్ సూత్రాలవైపు న్యూటన్ చెప్పినట్టు గురుత్వాకర్షణ కల్గకపోయినా.. సీసపద్యాల వల్లింపులు చెవుల్లో సీసంలా ధ్వనించే రోజులకు తగ్గట్టు… గ్లామర్ తప్ప గ్రామర్ పట్టని దినాల్లో.. సైన్సైతే ఓ రేటు!! ఆర్ట్సైతే ఓ రేటు!! కామర్సైతే ఇంకో రేటు!!! ఇలా లెక్కలు కట్టి డబ్బులిస్తే… లెక్కల బాధ తప్పించుకుని ఏకంగా డిగ్రీలు, పీజీలు, ఇంకా అవసరమైతే పీహెచ్డీలు కూడా అందివస్తున్నవేళ… చదువుకోవడమవసరమా…? చదువు కొంటే పోలా..? ఇదిగో ఇదీ.. ఏదో తెలుగు సినిమాలో ఓ హీరో చెప్పినట్టుగా నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుందన్న తరహా లెక్క! ఫేక్ సర్టిఫికెట్లకు లెక్కలు కట్టి ఘనులు విద్యనమ్మేస్తుంటే… అతణ్ని మించి ఆచంట మల్లన్న అన్నట్టుగా కొనేవారూ తయారవ్వడంతో.. ఇప్పుడు విద్యావ్యాపారం మార్కెట్ లో ఓ విచ్చలవిడి కాసుల దందా!!

అయితే ఈ మార్కెట్ చదువుల దందాలో తిలాపాపం తలా పిడికెడన్నట్టు పెడధోరణులు పడుతున్న యువత నుంచి… వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన ప్రొఫెసర్స్ వరకూ పాత్రధారులు, సూత్రధారులుగా ఉండటమే సాంకేతికతను అందిపుచ్చుకున్న నేటి విద్యావిధానంలో ఓ దురదృష్టకర పరిణామం! అయితే ఈ కంపు ఇప్పుడు దేశం మొత్తంలో ఉండగా… పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే యూనివర్సిటీస్… ఇబ్బడిముబ్బడిగా స్వయం ప్రతిపత్తి పొందే డ్రీమ్డ్ యూనివర్సిటీస్ తో… విద్య ఓ వ్యాపార వస్తువే అయిందే తప్ప… నాణ్యమైన విద్యావంతుల సృష్టి మాత్రం జరగడం లేదన్నది నగ్నసత్యం! అయితే తెలంగాణా లోనూ పదిహేను యూనివర్సిటీల్లోనూ ఇలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు ఏకంగా ఉన్నత విద్యామండలి ఛైర్మనే సెలవిస్తున్నారంటే… సుగంధాలు చల్లాల్సిన విద్యావృక్షాల మాట దేవుడెరుగుగానీ.. వ్యాపారమైన విద్యామొక్కలు పిచ్చిమొక్కలై.. ఎంతగా విస్తరిస్తున్నాయో.. పట్టిచూపే మాటలవి!

ఇప్పటికే ఒకటి ఒకటి ఒకటి.. రెండూ రెండూ రెండూ అంటూ.. ఒక పత్రికలో ఒక కళాశాల పేరుపై కనిపించిన ఓ విద్యార్థి ఫోటో.. ఇంకో పత్రికలో మరో కళాశాల పేరుపై కానవస్తూ.. జనాలను ఒకింత కన్ఫ్యూజ్ చేస్తూ.. కాసుల గలగల కోసం అర్రులు చాచే కార్పోరేట్ విద్య ఓ వైపు… తమ పిల్లలు డాక్టర్లైతే ఐపాయె.. ఆ తర్వాత వారి దగ్గరకొచ్చే రోగుల ఖర్మ అన్న రీతిలో.. పట్టుదలతో వారిని ఇతర దేశాలకు పంపి పైసా పేకో తమాషా దేఖో అన్న రీతిలో వైద్యులను సమాజానికందిస్తున్న పేరెంట్స్ ఇంకోవైపు! ఇలా పలు పెడు ధోరణుల్లో ఇప్పటికే వ్యాపారంగా మారిన విద్య… ఇదిగో ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్లను అచ్చూ ఒర్జినల్ సర్టిఫికెట్లలా తయారు చేసే మార్కెట్ లో అమ్మకానికి పెట్టడం కంటే విషాదమేముంటుంది…? పోనిత్తు! ఇప్పుడు ప్రతీదీ మార్కెట్ సరుకే! ఇదే మార్కెట్ లో తమ సృజనాత్మకతే పెట్టుబడిగా యూనికార్న్ కంపెనీలతో దూసుకెళ్తున్న యువత కనిపిస్తున్న క్రమంలోనే… ఫేక్ సర్టిఫికెట్లపై పెట్టుబడి పెట్టి చదువు కొంటున్నవారూ కనిపిస్తుండటమే.. మన సొసైటీ బ్యూటీయేమో?!!

-రమణ కొంటికర్ల

ఇవి కూడా చదవండి: హిందీ అధికారిక భాష మాత్రమే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్