Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవార్త వచ్చిందా.. షేర్ చేశామా? అంతే!

వార్త వచ్చిందా.. షేర్ చేశామా? అంతే!

Social Media No fact check: ‘దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయ్యమన్నట్లు’ అని తెలుగులో ఓ సామెత ఉంది.  ఒక విషయం గురించి తెలియగానే ‘సోషల్ మీడియా పులులు’ రెచ్చిపోతారు. వారిలో ‘పరోపకార గుణం’,  సాటి ప్రజలను చైతన్య వంతులను చేయాలనే ‘బాధ్యత’ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. తమకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది, విన్నది వెంటనే ఫోన్లో ఉన్నవారందరికీ  చేరవేయకపోతే వీరికి నిద్రే పట్టదు. ఈ విషయం నిజమా, అబద్ధమా.. దీనిలో సహేతుకత ఉందా..పదిమందికి చెప్పవచ్చా.. చెప్పడం వల్ల కలిగే నష్టం ఏమిటి…. ఇలా ఏదీ ఆలోచించే తీరిక, ఓపిక లేక వారికి ఉండదు. అది అబద్ధం అని తెలిసీ.. ఎదో ఒక ప్రయోజనాన్ని ఆశించి, కావాలని ఆ విషయాన్ని పనిగట్టుకొని ప్రచారం చేసేవారు మరికొందరు. వెరసి ఏది,  సత్యమో,  ఏది అసత్యమో తెలుసుకోవడం మామూలు మనుషులకు కష్టసాధ్యమవుతోంది.

Social Media

ఇక రాజకీయాలలో అయితే  సోషల్ మీడియా రాజ్యమేలడం ప్రారంభించిన తరువాత  ‘పీకే’లాంటి ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చిన తరువాత.. సోషల్ మీడియాలో పుట్టగొడుగులు చాలా పుట్టుకొచ్చాయి. పుట్టుకొచ్చాయి అనడం కంటే ఈ పుట్టగొడుగులను ‘ఎరువులు’ వేసి పెంచుకొస్తున్నారు.  వీరి పని అబద్ధాలు, అర్ధ సత్యాలు, వక్రీకరించబడిన సత్యాలు, సృష్టించిన (అ) సత్యాలు ప్రచారం చేయడం, జనానికి చేరవేయడం.  ఇక వీరి బలం సోషల్ మీడియా బకరాలు. వీరు నిజానికి సోషల్ మీడియా “పులులు” గా చెలామణిలో ఉంటారు. ఇక “పులులు” అనుకొనే “బకరా” లలో కొంతమంది… దీన్ని యుద్ధప్రాతిపదికన తనకు తెలిసిన వారికి, తెలియనివారికి పంపి చేతులు దులుపుకొంటారు. ఇంకొంత మంది.. దానికి తమ వ్యాఖ్యానాలు, ఇలాంటివే గతంలో జరిగిన సంఘటనలు కలిపి మరీ పంపిస్తారు. ఇంకొంతమంది ఇది ఇలానే జరుగుతూ ఉంటే.. భవిష్యత్ లో మానవ జాతికి వచ్చే కష్ట నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ.. జాతిని మేల్కొలపాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.

Social Media

మరికొంతమంది.. ఇలాంటివి ఖండించకపోతేనో లేదా సపోర్ట్ చేసి మరో పది మందికి చెప్పకపోతేనో.. మనిషిగా పుట్టడమే వ్యర్ధం అని ఆవేశంగా ప్రజలను “ఉత్తేజ పూరితులను” చేయాలని ప్రయత్నిస్తుంటారు.

ఇక ఈ రాజకీయ సోషల్ మీడియా ప్రచారాలలో కూడా రెండు విధాలైన ప్రచారాలు ఉంటాయి. ఒకటి.. పాజిటివ్ ప్రచారం.. “ఏలుతున్న ప్రభువులు” కనీ, వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నారని.. ఈ అభివృద్ధితో అంతా మెరిసిపోతుందని.

ఇక అభివృద్ధి మెరుపులు ఎలా ఉన్నా, ఈ ప్రచార మెరుపులలో వెలుగు “తీక్షణత” ఎక్కువ అవ్వడం వల్ల, సాధారణం జనం ఆ వెలుగులు చూడలేక కళ్ళు మూసుకోకపోతే కళ్ళు పోయే ప్రమాదం ఉంది కనుక, కళ్ళు మూసుకోక తప్పదు, కాబట్టి ఆ మెరిసే “అభివృద్ధి” వీరికి గుడ్డివాడి ముందు దీపం, చెవిటి వాడి ముందు శంఖమే.

ఇక “ఏలుతున్న ప్రభువుల” ఈ మెరుపు ప్రచారాలను.. “ఏలాలనుకొనే ప్రభువులు” ఉత్త చెత్తగా కొట్టి పారేస్తూ.. ఆ వెలుగులు తమకు ఏమి కనబడడం లేదని.. తమ పాలనలోనే ఎక్కువ వెలుగు ఉన్నాయని ఊదర కొడుతుంటారు.

రెండవది.. నెగటివ్ ప్రచారం.. చరిత్ర లో రాజులు, గతంలో ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పిదాలు ఏమిటి, గతం లో వారు ఎందుకు అలా చేశారు, దాంట్లో వారి స్వార్ధం ఏమిటి, దానివల్ల వారు ఏమి లాభ పడ్డారు, ప్రజలు ఎలా నష్టపోయారు.. వంటివి పరిశోధించి, కనిపెట్టి, వెలికి తీస్తుంటారు.

వాటిలో నిజానిజాలు, వాటికి ఆధారాలు ఏమి ఉండవు.  అభూత కల్పనలు చేసి, అప్పుడు ఏమి జరిగిందో ఊహించి మరీ సత్యాలను కనిపెడుతుంటారు. ఆ నష్టాలను పూడ్చడానికి తాము పడుతున్న కష్టాన్ని, దానికి ప్రజలు సపోర్ట్ చేయవలసిన అవసరాన్ని వీరు గట్టిగా బలగుద్ది మరీ చెపుతుంటారు. పనిలో పనిగా దీనిని ధిక్కరిస్తే భవిష్యత్ లో ప్రజలు పడబోయే కష్టాలు కూడా ఏకరువు పెట్టి.. ప్రజలకు వారికి సపోర్ట్ చేయవలసిన దుస్థితి కల్పిస్తారు. ఇలా ఈ సోషల్ మీడియా చేసే జిమ్మిక్ ల గురించి చెప్పుకోవాలంటే.. “చాట భారతమే” అవుతుంది.

లేటెస్ట్ గా.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్ మహల్ కట్టిన తరువాత ఆ కూలీల చేతులు నరికించేశాడు అనే వార్తను సోషల్ మీడియా నెత్తికి ఎత్తుకోన్నది. షాజహాన్ ఈ విధం గా చేసాడు అనడానికి ఏ చారిత్రక ఆధారాలు లేవని గతంలోనే ఎందఱో చరిత్ర కారులు చెప్పారట.
“చక్రవర్తి తలుచుకొంటే దెబ్బలకు కొదవా” అని.. చేతులు నరికినవాడు, చరిత్రను మాత్రం పాతేయడా అని అనుమానమో ఏమో… కరుడు కట్టిన దేశభక్తులకు ఈ విషయం అప్పుడప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుంది.

గతంలో 1960 దశకం లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగితే దాని పై కొంతమంది పరిశోధించి మరీ ఆధారాలు లేవని చెప్పినా.. ఇప్పటికి ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. అడపాదడపా, బీజేపి నాయకులు “మొహమ్మదీయ మొఘల్ రాజుల క్రూరత్వాన్ని” చెప్పడానికి..
ఈ విషయాన్ని వాడుకొంటూనే ఉన్నారు. దానికి ఆధారాలు ఉన్నాయా అని ఎవరు ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా లో ప్రచారానికి ఆధారాలు ఉండాలని ఈ చట్టం నిర్దేశించడం లేదు.

మనకు తోచింది, నచ్చింది, ప్రచారం చేసుకోవడానికే సోషల్ మీడియా ఉన్నది. అది నమ్మి భావోద్వేగాలకు గురి అయితే..అయిన వారిది తప్పుకాని .. సోషల్ మీడియా ది కాదు. గుర్తించండి.

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read :

సంతోషమే బలం, అభివృద్ధి….

RELATED ARTICLES

Most Popular

న్యూస్