Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమనసున్న మనిషి....

మనసున్న మనిషి….

Inspiring: కొన్ని కథలు కదిలిస్తాయి… అయితే అది, ఆ కథల వెనుక తెలియని పెయిన్ ఉన్నప్పుడే! అలాంటి కథే రాళ్లు కొట్టుకుంటూ బతికే బురుసు అమ్దూర్ రాజు, రేవతి దంపతులది!! ఎందుకంటే వారు ఏడాదిపాటు రెక్కలు ముక్కలు చేసుకుని బండలు కొట్టి సంపాదించిన  డబ్బును  ఓ సామాజిక కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇంకెవ్వరూ తమ కూతురులా విగతజీవి కాకూడదన్న ఆర్ధ్రత!

రాజు-రేవతి దంపతులు ప్రతియేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సుమారు ఐదొందల నుంచి వెయ్యి హెల్మెట్లు పంపిణీ చేస్తారు. ఎందుకంటే తమ కుమార్తె పుట్టిన సంతోషకరమైన రోజు, 8 ఏళ్ల ప్రాయంలో ఆ అమ్మాయిని కోల్పోయిన విషాదకరమైన రోజు… రెండూ ఆరోజే కావడం దానికి కారణం.

చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన బురుసు రాజు, రేవతీ దంపతుల కూతురు పావని బైక్ పై నుంచి పడిపోయింది. తలపైన చిన్న గాయాలే కాగా, వారికున్న పేదరికం, నిరక్షరాస్యత వల్ల తమ అమ్మాయికైన గాయాల తీవ్రతను అంతగా గుర్తించలేకపోయారు ఆ తల్లిదండ్రులు. కానీ, లోపల వారు గుర్తించలేని గాయం తీవ్రత 8 ఏళ్ల ముక్కుపచ్చలారని పావని ప్రాణాన్ని బలి కోరింది. అందులోనూ  పుట్టినరోజే పావని చనిపోవడం, బైక్ ప్రమాదగాయంతోనే చనిపోయినట్టుగా నిర్ధారణ కావడం రాజు, రేవతీ దంపతులను కలిచివేసింది. మార్చి 8, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే  రోజే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో.. ప్రతీ ఏటా హెల్మెట్ల పంపిణీ చేస్తున్నారు ఈ దంపతులు. అది కూడా నాణ్యమైన హెల్మెట్ల పంపిణీ!

పేదలు అంత నాణ్యమైన హెల్మెట్లు ఎలా పంపిణీ చేస్తున్నారని అనిపించవచ్చు.  అహరహం శ్రమించి,  ఇద్దరూ కలిసి రాళ్లు కొట్టి సంపాదించిన కూలీ డబ్బులో కొంత దాచి.. కూడబెట్టి  ఏడాదికోమారు… హెల్మెట్ల ఉచిత పంపిణీ చేపడుతోంది ఈ పేదజంట. తమ కూతురి చివరి శ్వాసలో ఆమెకిచ్చిన మాటకు కట్టుబడి ఇలా చేస్తున్నారు!

ఈమధ్య మన ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోలతో చేస్తున్న ప్రచారం, హెల్మెట్స్ పెట్టుకోవాలని సున్నితంగా, ఒకింత వ్యంగ్యంగా చెబుతూ పూలివ్వడం… మరికొన్ని చోట్ల హెల్మెట్ లేని వాళ్లను ఆపి, వారి నుంచి డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న హెల్మెట్ షాపుల్లో హెల్మెట్ కొనుక్కొచ్చి వారిచే ధరింపజేయడం… ఇంకొంచెం అడుగు ముందుకేసి ఓ యమధర్మరాజు పాత్రధారి వేషంలో నడిరోడ్డుపై అవగాహన కల్పించడం.. ఇలాంటివెన్నో ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్నారు. ఎందుకంటే వారికది కర్తవ్య బాధ్యత! కానీ.. రాజు, రేవతి దంపతులది పెయిన్. హెల్మెట్ లేకపోవడంతో బండి పైనుంచి పడి బిడ్డ చనిపోయిన నాటి నుంచి… తాము బతికున్నంత కాలం ఆరని ఆర్ధ్రత! తీరని పుత్రికాశోకం!! అందుకే ఈ దంపతులు సమాజానికి స్పూర్తిగా నిలుస్తూ, తమ పెద్దమనసు చాటుకుంటూ, సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు.

నాణ్యమైన హెల్మెట్లను బండి నడుపుతున్నవారితో పాటు, వెనుక కూర్చున్నవారికీ ఉచితంగా అందిస్తున్న ఈ జంట చేస్తున్న గొప్ప పనికి ఆకర్షితుడైన బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీరికి సరసమైన ధరలకే ఈ హెల్మెట్లను అందిస్తున్నాడు. అయితే ఈ దంపతుల గొప్పతనమేంటంటే… ఎవరైనా మొబైల్ తో ఫోటో కొట్టినా, కెమెరాతో క్లిక్కుమనిపించే యత్నం చేసినా వెంటనే హెల్మెట్ల పంపిణీని మానుకుంటారు. ఎందుకంటే వీళ్లు చేస్తున్నది ఏదో  స్వచ్చందసేవ పేరుతో వార్తల్లోకెక్కేందుకో… లేక తమ స్వార్థం కోసమో కాకపోవడమే దీనికి కారణం . అందుకే పబ్లిసిటీ ఏమాత్రం నచ్చని రాజు, రేవతి గత ఎనిమిదేళ్లుగాఈ పనిచేస్తున్నా ఎక్కడా అంతగా ఫోకస్ కాలేదు. ఇంట్లో గరిటె తిప్పితే కోవిడ్ టైమంతా వార్తల్లో వ్యక్తులై నిల్చే సెలబ్రిటీలు కారు కాబట్టే… ఈ పేద బుద్ధిజీవులు అడ్వర్టైజింగ్ కు దూరంగా నిల్చారు.

Stone Cutter Couples Story

హెల్మెట్ అనే నిబంధన కంపల్సరీ చేయాలన్నదే రాజు చెప్పే మాట. అప్పుడే తమలాగా కాకుండా… మరెన్నో కుటుంబాలు సంతోషంగా ఉండగలుగు తాయని చెబుతారు ఈ దంపతులు. అందుకే రాజు, రేవతి ఇప్పుడు ప్రతీ ఏటా రోడ్డు ప్రమాద నివారణ ఉత్సవాల పేరిట పోలీస్, రోడ్డు రవాణాశాఖ నిర్వహించే అవగాహనా కార్యక్రమాల్లోనూ ఈ చిత్తూరు ప్రాంతమంతా ముఖ్య అతిథులవుతున్నారు.

-రమణ కొంటికర్ల

ఇవి కూడా చదవండి:

https://idhatri.com/marriages-in-india-has-become-a-platform-to-exhibit-their-wealth/

RELATED ARTICLES

Most Popular

న్యూస్