చైనాలో ఈ రోజు ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. నైరుతి చైనాలో బోయింగ్-737 విమానం కన్మింగ్ (kunming) నుంచి గ్వాన్కజు (guangzhou) నగరానికి వెళుతుండగా పర్వత ప్రాంతాల్లో దుర్ఘటన చోటుచేసుకుంది. గ్వాంగ్జీ ప్రావిన్స్ గగనతలంలో ప్రయాణిస్తుండగా వూజో నగరం సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. ఈ విమానంలో 133 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ మేరకు చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ రిపోర్ట్ చేసింది. విమానం ఓ కొండపై కూలిపోగా, అగ్ని కీలలను చూసి అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పుకుంటున్నారు.
ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన సహాయక బృందాలను తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన తీరు, విమానం కూలిపోయిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా అందులోని వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు.