Kiwis won: ఐసిసి మహిళా వరల్డ్ కప్ టోర్నీలో నేడు జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 71 పరుగులతో ఘనవిజయం సాధించింది. కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్ సెంచరీ తో రాణించగా, హన్నా రో ఐదు వికెట్లతో సత్తా చాటింది. అయితే పాకిస్తాన్ ఒకే విజయంతో చివరి స్థానంలో ఉండగా, ఆతిథ్య కివీస్ కు కూడా సెమీస్ అవకాశాలు లేనట్లే.
క్రైస్ట్ చర్చ లోని హేగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ తొలి వికెట్ (సోఫీ డివైన్-12) కు 31 పరుగులు చేసింది. రెండో వికెట్ కు సుజీ బేట్స్- అమేలియా కెర్ర్ లు 68 పరుగుల (అమేలియా -24) భాగస్వామ్యం నెలకొల్పారు. సత్తార్ వైట్ డకౌట్ కాగా, మడ్డీ గ్రీన్ 23, హాల్లీ డే-29; కాటే మార్టిన్-30 పరుగులు చేశారు. సుజీ బేట్స్ 135 బంతుల్లో 14 ఫోర్లతో 126 పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నిదా దార్ మూడు; అనమ్ అమీన్, ఫాతిమా సనా, నష్రా సంధు తలా ఒక వికెట్ పడగొట్టారు.
పాకిస్తాన్ తొలి వికెట్ (సిద్రా అమీన్- 14) కు 31 పరుగులు చేసింది. నిదా దార్-50 ; కెప్టెన్ బిస్మా మరూఫ్-38 పరుగులతో రాణించినప్పటికీ సరైన భాగస్వామ్యం నెలకొల్పడంలో, వేగంగా స్కోరు చేయడంతో పాక్ విఫలమైంది. హన్నా రో ఒకే ఓవర్లో రెండు వికెట్ల చొప్పున రెండు ఓవర్లలో నాలుగు తో పాటుమొత్తం ఐదు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చింది. దీనితో 50 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేయగలిగింది.
సుజీ బేట్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
Also Read : మహిళల వరల్డ్ కప్: సెమీస్ కు సౌతాఫ్రికా