దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద ఝలక్ నుంచి కోలుకోక ముందే మరో సీనియర్ నేత, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ( Sachin Pilot ) వైఖరి అనుమానాలకు తావిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ లో అసంతృప్త నేతలు పార్టి అధిష్టానం వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్ దౌస పట్టణంలో ఈరోజు సచిన్ తండ్రి, కాంగ్రెస్ దివంగత నేత రాజేష్ పైలట్ వర్ధంతి కార్యక్రమానికి సచిన్ పైలట్ హాజరు కావటం లేదని ఎమ్మెల్యే వేద ప్రకాష్ సోలంకి ప్రకటించారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా వర్ధంతి కార్యక్రమానికి రాలేనని సచిన్ పైలట్ చెప్పినట్టు సోలంకి వెల్లడించారు. ముఖ్యమైన ఈ కార్యక్రమానికి పైలట్ రాకపోవటం సంచలనంగా మారింది. దౌస నియోజకవర్గం ఎంపిగా రాజేష్ పైలట్ 1984 నుంచి 1999 వరకు ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు.
Sachin Pilot :
అయితే అసలు కథ వేరే ఉన్నట్టు ఢిల్లీ, జైపూర్ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో తన వర్గం వారికి సముచిత స్థానం దక్కడం లేదని గత ఏడాది జూలై లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసి హర్యానాలో రెబల్ ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించారు. అప్పుడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని సచిన్ ఇబ్బందులు పరిష్కరిస్తామని అందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ నాయకత్వంలో కమిటీ వేసింది. ఏడాది గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని సచిన్ వర్గం నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
పంజాబ్ లో నవజ్యోత్ సింగ్ సిద్దుకు ముఖ్యమంత్రితో ఉన్న సమస్యలను కమిటీ వేసి పది రోజుల్లో పరిష్కరించిన అధిష్టానం పైలట్ విషయంలో ఏడాది కావస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సచిన్ వర్గం ఆరోపిస్తోంది. జైపూర్లో గురువారం సచిన్ పైలట్ నివాసంలో జరిగిన సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరో 15 మంది ఎమ్మెల్యేలు సచిన్ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
మీడియా రాద్ధాంతం తప్పితే, పార్టీలో సమస్యలు లేవని రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియ అన్నారు. పైలట్ ఎలాంటి డిమాండ్లు చేయలేదని, ఏవైనా ఉన్నా పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకుంటామని ఖచరియ వెల్లడించారు.
ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అంతా సజావుగానే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే పైకి అలా కనిపిస్తున్నా తొందరలోనే మంత్రి వర్గ విస్తరణ చేసి పైలట్ వర్గానికి సముచిత స్థానం కల్పిస్తారని సమాచారం.
రాహుల్ గాంధి మిత్రబృందంగా పేరున్న నేతలు జ్యోదిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద కమలం గూటికి చేరటం కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకమే. మధ్యప్రదేశ్లో కమల్ నాథ్ కుట్రలతో సింధియా, ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకగాంధి వైఖరితో జితిన్ పార్టీని వీడారనేది బహిరంగ రహస్యమే. సచిన్ విషయంలో తొందరపడక పోతే కాంగ్రెస్ అధిష్టానానికి మరోసారి భంగపాటు తప్పదు.
-దేశవేని భాస్కర్
Must Read : రఘురామపై చర్య తీసుకోండి: స్పీకర్ కు భరత్ వినతి