పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏప్రిల్ ౩వ తేదిన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన నాటి నుంచి పాక్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవికి ఎసరు వచ్చింది. దీంతో తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ ఇప్పటికే మొదలైంది. విపక్షాల తరపున పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత షా బాజ్ షరీఫ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇమ్రాన్ గద్దె దిగితే విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి షా బాజ్ షరీఫ్ అని మార్చి 30 వ తేదిన జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తీర్మానం చేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా సుధీర్గ కాలం బాధ్యతలు నిర్వహించిన షా బాజ్… పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం తదితర అంశాలపై 2021 నుంచి ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలు పెట్టారు. 1997 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడుసార్లు పంజాబ్ సిఎం గా షా బాజ్ సేవలందించారు. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సోదరుడైన షాబాజ్ షరీఫ్ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులో షాబాజ్ ఆయన కుమారడు హంజా ఆస్తుల్ని 2018లో ప్రభుత్వం సీజ్ చేసింది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాకే తగిలింది. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై రేపు (శనివారం ఈ నెల 9న) ఓటింగ్‌ను నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇమ్రాన్ పార్టీకి చెందిన కొందరితో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలకు చెందిన కొందరు విపక్షంతో చేరిపోయారు. దీంతో తమ ప్రభుత్వ మనుగడ కోసం ఓ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన ఇమ్రాన్… పాక్ జాతీయ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌తో ఓ ప్రకటన చేయించారు.
ఇమ్రాన్ వ్యూహం మేరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్.. ఏకంగా జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ పరిణామంపై విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇందుకోసం జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: సుప్రీంకోర్టు తీర్పుతో ఇమ్రాన్ కు పదవీ గండం