బిహార్ లోక్ జనశక్తి పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు వ్యతిరేకంగా లోక్ జనశక్తి ఎంపీ లు జట్టుకట్టారు. లోక్ సభలో పార్టీ పక్ష నేత పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్ ను ఆ పార్టీ ఎంపీ లే తప్పించారు. కొత్త నేతగా పశుపతి కుమార్ పరస్ ను ఎన్నుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఆదివారం కలిసిన పార్టీ ఎంపీ లు పార్టీ లో జరిగిన మార్పునకు సంబంధించిన సమాచారం రాతపూర్వకంగా అందించారు. సభలో ఎల్.జే.పి పక్ష నాయకుడిగా ఇకనుంచి పశుపతి కుమార్ పరస్ ను గుర్తించాలని కోరారు.
పశుపతి కుమార్ హాజీపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే పశుపతి కుమార్ – చిరాగ్ పాశ్వాన్ దగ్గరి బంధువే కావటం గమనార్హం. ఈ వ్యవహారంపై చిరాగ్ పాశ్వాన్ వైఖరి ఏంటో తెలియాల్సి ఉంది.
లోక్ జనశక్తి పార్టీ తరపున లోక్ సభలో ప్రస్తుతం ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎల్ జే పి ప్రస్తుతం ఎన్ డి ఎ కూటమిలో కొనసాగుతోంది. లోక్ జనశక్తి పార్టీ ఫౌండర్ రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత చిరాగ్ పార్టీ భాద్యతలు స్వీకరించారు. అయితే పార్టీ వ్యవహారాల్లో చిరాగ్ వైఖరి ఏకపక్షంగా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
బిహార్ పరిణామాలు చూస్తుంటే త్వరలోనే లోక్ జనశక్తి పార్టీ రెండు ముక్కలు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో తలపడటమే తప్పని పార్టీ నేతలు మొదటి నుంచి అసంతృప్తి తో ఉన్నారు. చిరాగ్ పై తిరుగుబాటు చేసిన నేతల వెనుక జనత దళ్ యు హస్తం ఎంతవరకు ఉందొ తొందరలోనే బయట పడనుంది.