Mehabooba Mufti : జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఢిల్లీలో సుమారు గంట సేపు సమావేశమైన నేతలు దేశంలో రాజకీయ పరిణామాలు, కశ్మీర్ లో రాబోయే శాసనసభ ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సోనియా – ముఫ్తిల మధ్య ప్రస్తావనకు వచ్చిందని 10 జనపథ్ వర్గాలు వెల్లడించాయి. సోనియాగాంధీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడకుండానే మహబూబా ముఫ్తీ వెళ్ళిపోయారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ – పిడిపి ల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది. ఇప్పటివరకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో తలపడిన కాంగ్రెస్ ఈ దఫా పిడిపితో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. కశ్మీర్ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న పిడిపితో జతకడితే బిజెపి నిలువరించవచ్చనే ఎత్తుగడతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది.
మరోవైపు సోనియాగాంధిని ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ రోజు ఢిల్లీలో కలిశారు. సోనియా గాంధీని ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ కలవటం ఇది మూడోసారి. నాలుగు రోజుల్లోనే మూడుసార్లు కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే మరో రెండు సార్లు వీరి సమావేశం ఉంటుందని పార్టీ నేత కేసి వేణుగోపాల్ వెల్లడించారు. త్వరలోనే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
సోనియా – ప్రశాంత్ కిషోర్ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్, ఏకే అంటోని, ముకుల్ వాస్నిక్, అంబిక సోని, కేసి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాల తదిరులు పాల్గొన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు 370 సీట్లు సాధించటమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహరచన వొదిలేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావలనుకోవటం… కాంగ్రెస్ కు ఎంతవరకు మేలు చేకూరుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read : తెలంగాణలో ‘పీకే’ ది ఎవరు!