Groundwater Conservation : అపర భగీరథుడు ముఖ్య మంత్రి కె.సి.ఆర్ రాష్ర్ట ప్రజలు సాగు నీటికై, త్రాగు నీటి కొరకై ఎలాంటి ఇక్కట్లకు లోను కాకుండా ఉండేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి 70 శాతం పూర్తయిందన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాలను పురస్కరించుకొని జల మండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా మంత్రుల నివాస ప్రాంగణంలో ప్లకార్డులు, కర్ర పత్రాలను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
ఏడేళ్లలో తెలంగాణ కోటి ఎకరాలకు సాగు నీటిని అందిస్తూ దేశంలోనే వ్యవసాయ రంగం లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేశారు. రైతన్నలకై ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. హైద్రాబాద్ నగర ప్రజల దాహర్తిని తీర్చడానికి ఎన్నో వందల కిలోమీటర్ల నుండి వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మంచి నీటిని నగరానికి తీసుకొచ్చి ఉచితంగ సరఫరా చేస్తున్నారు.
రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలను పరిరక్షించుకొని నీటి నిల్వలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజల అందరి పై ఉన్నదని ప్రతి ఒక్కరూ తమ ఇంటి అవరణంలో విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు. రాబోయే వర్షాకాలంలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకొని రాబోయే తరాలకు నీటి నిల్వలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డి.జీ.యం శ్రీనివాస్ రావు, జీ.యం రాంబాబు, కార్మికులు మరియు గాంధీ సంస్థల ప్రతినిధులు యానల ప్రభాకర్ రెడ్డి, మైనేని వాణి, పి గిరిధర్ గౌడ్,నరేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.