condemnable: ఒంగోలులో ఆర్టీయే అధికారుల తీరుపై ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారులు కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఒంగోలులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్టీయే అధికారులు తిరుపతి వెళుతున్న ఓ కుటుంబం నుంచి కారును బలవంతంగా తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ప్రతిపక్షాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో పలువురు ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ ఘటనను ఆక్షేపించారు. సిఎం టూర్ కోసం ప్రైవేట్ కారును బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, ప్రైవేటు వాహనాన్ని దొంగిలిస్తారా అని నిలదీశారు. రేపు ఎవరైనా అమ్మాయిలు కావాలంటే ఇళ్ళల్లోకి వచ్చి అమ్మాయిలను తీసుకెళ్తారా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని, ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉందన్నారు.
వినుకొండ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ కుటుంబం ఒంగోలులో టీ తాగుదామని కారు ఆపితే కానిస్టేబుల్ వచ్చి చెప్పా పెట్టకుండా కారు తీసుకెళ్లడం దేనికి సంకేతమని, ఇది అరాచకం కాదా అని నిలదీశారు.
Also Read : బాబుని తిడితే ఖబడ్దార్: బుద్దా వార్నింగ్