వేదమంత్రాల మధ్య మూడుముళ్లు ఏడడుగులు…ఇంతేనా పెళ్లంటే?.. కాదంటోంది నికితా కౌల్. ఆమె కూడా అందరిలానే పెళ్లి గురించి ఊహించుకుంది. కాబోయే భర్తది దేశరక్షణ బాధ్యత అన్నపుడు గర్వపడింది. నిండునూరేళ్ళూ సావాసం చేద్దామనే ఇద్దరూ అనుకున్నారు. అనూహ్యంగా పుల్వామా దాడిలో (2019) మేజర్ విభూతి శంకర్ దవుండియాల్ మరణించారు. అప్పటికి వారి వివాహమై సరిగ్గా తొమ్మిదినెలలు. నికితది కార్పొరేట్ కంపెనీ ఉద్యోగం. తన మానాన ఉద్యోగం చేసుకుంటూ కొత్త జీవితం వెతుక్కోవచ్చు.
కానీ నికిత భర్త అంత్యక్రియలు పూర్తవగానే తానూ దేశ సేవకే అంకితం అనుకుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి పాసవడమే కాక కఠినమైన శిక్షణ కూడా పూర్తిచేసింది. లెఫ్టినెంట్ హోదాలో ఇటీవలే బాధ్యతలు స్వీకరించి భర్తకు తగ్గ భార్య అనిపించుకుంది. సహ ధర్మచారిణి అంటే నూరేళ్లు కాదు తొమ్మిది నెలలు కలసి ఉన్నా చాలు అని నిరూపించింది నికిత. బహుశా ఇటువంటి జంటల గురించే కాబోలు ఓ సినీకవి ఇలా అన్నారు
‘నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి మనకోసం
దండగుచ్చాను నా ప్రాణం..
వెండి ఎన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతాలు చెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పోలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే’
భర్త ధైర్య సాహసాల కొనసాగింపుగా భార్య కూడా దేశ రక్షణ బాధ్యతల్లోకి దిగడం గొప్ప విషయం. నిశ్చయంగా నికిత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది.