బహుళ ప్రజారరణ పొందిన సామాజిక మాధ్యమం ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సమాయాత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటి నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు కేంద్రం కన్నెర్ర చేసింది. ట్విట్టర్ తరఫున దేశంలో ప్రత్యేక అధికారులను నియమించాలని కేంద్రం కోరినా ఇంతవరకూ ఆ పని చేయలేదు. దీనితో కొత్త ఐటి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని నినయించింది. ఉత్తర ప్రదేశ్ లో ట్విట్టర్ పై మొదటి కేసు నమూడైంది.
ఘజియాబాద్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోలు కొందరు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలు తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు తొలగించాలని పోలీసులు, దర్యాప్తు అధికారులు కోరినా ఆ పని చేయక పోవడంతో జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలతో పాటు ట్విట్టర్ పై కూడా కేసు నమోదైంది. ఇకపై కేంద్రం కల్పించే చట్ట పరమైన రక్షణలను కోల్పోనుంది.
భారత దేశంలో తమ కార్య కలాపాలు, ఫిర్యాదులను పరిశీలించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కొత్త ఐటి చట్టం పేర్కొంది. కానీ ట్విట్టర్ ఆ పని ఇంతవరకూ చేయలేదు. కొత్త ఐటి చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్ యాజమాన్యానికి గత కొంత కాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల భారత ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతా నుంచి వెరిఫైడ్ బ్లూ టిక్ తొలగించిన సందర్భంలోనూ అటు కేంద్రం, ఇటు బిజెపి ట్విట్టర్ పై దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే.