Nordic Conference : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటనలో భాగంగా మూడవ రోజు డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌లో నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్‌ల్యాండ్ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను కోరారు. ప్రధానంగా టెలికాం, డిజిటల్ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు.
నరేంద్ర మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ హెల్త్‌కేర్ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. భారత్ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు. స్వీడన్ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకబ్స్‌డాటిర్, ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు.
కోపెన్‌హగెన్‌లో బుధవారం నిర్వహించిన ఇండియా–నార్డిక్ రెండో సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఫిన్‌లాండ్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్, రష్యాను కోరారు.
ప్రపంచంలో చాలాదేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం నడుచుకోవడం లేదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం లేదని ప్రధానమంత్రులు ఆక్షేపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు.
Also Read : సాంస్కృతిక వైవిధ్యమే భారతీయుల బలం ప్రధాని మోడీ