Trailer to Rajnath: ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ ‘మేజర్‘ సినిమా ముందు వరుసులో వుంది. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మేకర్స్, భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హీరో అడివి శేష్, దర్శకుడు – శశి కిరణ్ తిక్కా ఆదివారం మే 1వ తేదీన ఢిల్లీలో రక్షణ మంత్రితో భేటి అయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను ప్రదర్శించి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ గురించి మాట్లాడారు. ఇదే సందర్భంలో రాజ్‌నాథ్ సింగ్ మేజర్ సినిమా నినాదాన్ని ఆవిష్కరించారు. తెల్లటి కాన్వాస్ పై ‘జాన్ దూంగా దేశ్ నహీ’ అనే ఫోటో ఫ్రేమ్ ని రివీల్ చేశారు. ఈ నినాదం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధీరత్వానికి అద్దం పట్టింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కథను చూపించబోతున్న దర్శకుడు శశి కిరణ్ తిక్క, అడివి శేష్‌లను అభినందించారు. చిత్ర యూనిట్ రక్షణ మంత్రి, కుటుంబ సభ్యుల కోసం సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ‘మేజర్’లో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ తారాగణంగా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మిస్తుంది. చిత్రం జూన్ 3 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read : మే 9న ‘మేజర్’ థియేట్రికల్ ట్రైలర్