లోక్ జనశక్తి పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎల్ జే పి జాతీయ అధ్యక్షుడిగా పశుపతి కుమార్ పరస్ ఎన్నికయ్యారు. పశుపతి కుమార్ కు పోటీగా ఈ రోజు సాయంత్రం వరకు ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. ఇక లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పశుపతి పేరు లాంచనంగా ప్రకటించినట్లే.
చిరాగ్ పాశ్వాన్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ శ్రేణులు ఇన్నాళ్ళు అయోమయానికి లోనయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (యు) తో పోటిపడటం చిరాగ్ చేసిన ఘోర తప్పిదంగా నేతలు భావిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో కొందరు నేతల ప్రభావం వల్లే చిరాగ్ పార్టీని పరాజయం వైపు తీసుకెళ్లారని పరోక్షంగా బిజెపి కుట్రగా అనుమానిస్తున్నారు!
పశుపతికుమార్ పార్టీ లోక్ సభ నేతగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే పార్టీ పగ్గాలు కూడా చేపట్టడం బిహార్ రాజకీయాల్లో కొత్త పోత్తులకు తెరలేపే అవకాశాలు ఉన్నాయి. జనతాదళ్ (యు) అధినేత నితీష్ కుమార్ తో పశుపతికి మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన పశుపతి కుమార్ హాజీపూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎంపి గా ప్రాతినిద్యం వహిస్తున్నారు.