Friday, November 22, 2024

పచ్చ పాపడ్

Sweet Memories: వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టంటే అతిశయోక్తి అవుతుందేమోగానీ… వెతక్కుండానే దొరికిన పాపడ్ అది. పెరుగు ప్యాకెట్ కోసమని మొన్నామధ్య ఓ దుకాణం కెళితే  ఐదు రూపాయలకు ఐదు పాపడాలు.. ఆ పొట్లం చూసి ముందు నోరూరింది.. ఆ తర్వాత మా ఊరు యాదికొచ్చింది.. చిన్ననాట పాపెడాలపై పడ్డ మోజు గుర్తుకొచ్చింది.. అరె వా.. బాల్యం జ్ఞాపకాలు అంత మధురమైనవా? అందుకే అన్నారేమో ఓల్డ్ ఈజ్ గోల్డని!

ఇసుక స్థంభానికి.. దేవుడి విశ్రాంతి మంటపానికి తేడా తెలియని బాల్యమది. విశ్రాంతి మంటపాన్నే ఇసుక స్తంభమని పిల్చుకునే అమాయకత్వం ఇప్పటికీ కొనసాగేంత భావనను మిగిల్చిన బతుకుచిత్రమిది. అసలు సంగతికొస్తే.. ఆ విశ్రాంతి మంటపాన్నానుకునే మా బిస్మిల్లా టేలా. ఆ టేలా పక్కనే నాల్గుడగులు వేస్తే మా లంకంత కొంప. కొందరుంటారు ఊళ్లల్లో! వాళ్లు పెద్దగా చదువుకోకపోవచ్చు! పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ వెలుగబెట్టకపోవచ్చు! సెలబ్రిటీలు కాకపోవచ్చు! ఇవాళ సోషల్ మీడియాలో పదిహేను లైకులు, పది కామెంట్స్, ఐదు షేర్లు చూసుకుని ఎగిరెగిరి పడే అమాయకత్వ బాపతు అంతకన్నా కాదు! కానీ, వాళ్లను ఆ ఊళ్లు ఎన్నటికీ మర్చిపోవు. మా బిస్మిల్లా కూడా అంతే!! మాకాయన మర్చిపోలేని యాదయ్యే.. జ్ఞాపకాల క్రియేటివిటీ!!

Fryums Sticks

అస్గరలీ జర్దా, తమలపాకులు, సున్నం, కాచు, పుదీనా, లవంగాలు, యాలకులు… ఇదీ మా నాన్న పాన్దాన్. ఈ మొత్తం ఐటమ్స్ కు కేరాఫ్ మా బిస్మిల్లా టేలా! అయితే బచ్చాగాళ్లకేంది.. మీనాన్నకు కదా పని అనుకునేరూ?!! వాటితో పాటే అదే టేలాలో రసగుల్లాలు, లెమన్ ఫ్లేవర్ ఎర్ర పిప్పరమెంట్లు.. అలా ఎన్నో! వాటితోపాటే… ముందుగా మనం చెప్పుకున్న పచ్చకలర్ పాపెడాలు. అప్పుడప్పుడే ఎన్టీవోడి తెలుగుదేశం పార్టీతో రాష్ట్రమంతా పచ్చతివాచీ పర్చుకున్నట్టుగా తెలుగుదేశం జెండాలు కనబడ్డమో ఏమోగానీ… అలా డీకోడ్ చేస్తే మాత్రం ఆ ప్రభావం పాపెడాలపై మోజు పెరగడానికి మరో అదనపు కారణమేమో ఆ బాల్యంలోనైతే మాకు తెల్వదుగానీ…మొత్తంగా మొహం మొత్తేంతగా పాపెడాల భరతం మాత్రం పట్టేవాళ్లం!

ఇవాళంటే పదిరూపాయలు పెట్టి స్నిక్కర్ కొంటే అబ్బ ఇంకొంచెముంటే బాగుండేదేమో, ఇరవై రూపాయలది కొని ఉంటే బాగుండునేమోనని మనసులో ఎక్కడో ఓ ఆలోచన.  ఎందుకంటే ఇప్పుడంతా కాస్ట్లీ ప్రపంచం. సంపాదన తక్కువ ఖర్చెక్కువ. ఇదీ మధ్యతరగతి బతుకుచిత్రం! మరి ఆనాడు కాదా మధ్య తరగతి? నాడూ నేడూ అదే మధ్యతరగతీ.. అవే కోర్కెలు! ఐతే, నాడు ఐదు పైసలకొక్క పాపడ చొప్పున 20 పైసల బిళ్లలు రెండు పట్టుకుపోతే నలభై పైసలకు ఎనిమిది పాపెడాలు తెచ్చుకునేటోళ్లమని మళ్లీ నేను లెక్కలేం చెప్పడంలేదుగానీ.. ఇంకొన్ని కావాలని ఉవ్విళ్లూరి ‘బిస్మిల్లా అబ్బా ప్లీజ్’ అంటే…. ‘ఏట్’ అంటూ నాలుక బయటకు తీసి పళ్లతో కర్చుకుంటూ చూసే నాటి బిస్మిల్లా దృశ్యం ఎప్పటికీ చెదిరిపోనిదే! ఐతే బాల్యపు కొంటరితనం ఊరుకోనీయదు పైగా పది వేళ్లకు ఇదిగో పైన చిత్రంలో చూపించినట్టు పది పెట్టుకుని అలా నిక్కర్ పైన నా అంతోడే లేడన్నట్టుగా రావాలన్న బలమైన కాంక్ష.. కాబట్టి.. ఇంకో రెండెక్కువ పట్టుకొచ్చుకోవడం.. సారీ సారీ అదేనండీ కొట్టుకొచ్చుకుంటే… అక్కడికక్కడికి సరిపోతాయనే ఓ చిన్న ఆశ… రసి ఇవే ఆ పచ్చి జ్ఞాపకాల్లోని కొసమెరుపులు!

Fryums Sticks

ఎందుకు పోతాడో, ఎందుకు తిరిగి అదే బస్సెక్కి వస్తాడో… అసలది నిజమేనో, కాదో, అల్లికో కూడా తెలీదుగానీ.. మా బిస్మిల్లా గురించి చిన్నప్పట్నుంచీ ఓ కథ వినిపించేది. ఆ కాలంలో ఆర్టీసీ బస్సులకన్నా ప్రైవేట్ టూరిస్ట్ ట్రావెల్ బస్సులెక్కువ. ఓ పక్క రెండు సీట్లైతే ఇంకో పక్క వాటంగా ఉంటే ఇద్దరు మాత్రమే పట్టే మూడు సీట్లు. అగో ఆ బస్సెక్కి మా బిస్మిల్లా జైతాలకాడికి పోవడం… ఓసారి కిందకు దిగడం.. మళ్లీ అదే బస్సెక్కి ఊరికి తిరిగి రావడం.. ఇదీ బిస్మిల్లాకు నాడు ఆనవాయితీగా చెప్పుకునే ఓ వింత అలవాటు! అలా సరదా సరాదాగా నవ్వుకునే చిలిపికథలకూ ఓ సబ్జెక్ట్ మా బిస్మిల్లా! అంతేకాదు అలా ఎవరైనా ఏదైనా ఊరికెళ్లి వెంటనే ఇట్టే పనిచేసుకుని వచ్చేశారనుకొండ్రి ‘ఏందిరా బిస్మిల్లా జగిత్యాల పోయినట్టు పోయివచ్చినవ్’ అనేంతగా మా బిస్మిలా జైతాల టూర్ ఫేమస్!!

ఇంతకీ మా ఊరేదంటే ధరంపురి,  దానిలో ఇసుకస్థంభం పక్కనే బిస్మిల్లా టేలా… దానిలో పచ్చని పాపడాలు.. అన్నింటికంటే తెలువకుండానే కనెక్టివిటీ పెంచి బాల్యాన బిస్మిల్లాను ‘బిస్పిల్లా’ అని పిల్చుకున్న బంధం.. ఇవన్నీ ఎప్పటికీ నోస్టాల్జియా!

-రమణ కొంటికర్ల

ఇవి కూడా చదవండి:

మామిడా? మజాకా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్