What a match: ఐపీఎల్ ఈ సీజన్లో ఓ రసవత్తర మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం దద్దరిల్లింది. లక్నో విసిరిన 211 పరుగుల విజయ లక్ష్య సాధనలో చివరికంటూ పోరాడిన కోల్ కతా 2 పరుగులతో ఓటమి పాలైంది.
భారీ విజయ లక్ష్యం…. 9 పరుగులకే రెండు వికెట్లు అయినా సరే… స్థైర్యం కోల్పోకుండా కోల్ కతా చూపిన పోరాట స్ఫూర్తి క్రికెట్ అభిమానుల ప్రశంశలు అందుకుంది. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు కావాల్సిన దశలో కూడా రింకూ సింగ్ 4,6,6,2 పరుగులతో విజయానికి జట్టును అతి దగ్గరగా తీసుకెళ్ళాడు… కానీ ఐదో బంతికి రింకూ ఔట్ కావడం కోల్ కతా విజయాన్ని దెబ్బతీసింది. చివరి బంతికి ఉమేష్ యాదవ్ డకౌట్ కావడంతో కేవలం 2 పరుగులతో ఓటమి పాలయ్యింది.
నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో తన సత్తా చాటి 70 బంతులలో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 140; కెప్టెన్ కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఐపీఎల్ చరిత్రలో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్ కతా పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (0) వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో జట్టు స్కోరు 9 వద్ద మరో ఓపెనర్ అభిజీత్ తోమార్(4) కూడా ఔటయ్యాడు. నితీష్ రానా 22 బంతుల్లో 9 ఫోర్లతో 43; కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ 29 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లతో 50; శామ్ బిల్లింగ్స్ 24 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లతో 36; రింకూ సింగ్ 15 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లతో 40 పరుగులు చేసి అవుట్ కాగా సునీల్ నరేన్ 7 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, మార్కస్ స్టోనిస్ చెరో మూడు; కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
140 పరుగులు చేసిన డికాక్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది
Also Read : హైదరాబాద్ గెలిచింది