ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ నెల 26వ తేదిన రాష్ట్రానికి రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా రాష్ర్టానికి వస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు.

ఇప్పటికే బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతం కావడంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సమాచారం అందడంతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను కనివినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేసే దిశగా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు.  జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ద్రుష్టి పెట్టిన నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Also Read : అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై నార్డిక్ సదస్సు ఆందోళన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *