Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

We Too: విద్యా బోధనలో సాంకేతికత, డిజిటల్ వర్చువల్ పద్ధతులు ఎన్ని వచ్చినా…పాఠశాలకు వెళ్లి గురుముఖతః చదువు నేర్చుకోవడమే ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విద్యా విధానం. శాల అంటే ప్రాంగణం. పాఠాలను బోధించే లేదా నేర్చుకునే ప్రాంగణం పాఠశాల. కాలేజీ రోజులకు పాఠాలు చెప్పడం, నేర్చుకోవడం అంత సీరియస్ కాదు కాబట్టి కాలేజీ పాఠశాల కాలేదు. యూనివర్సిటీలో కూడా పాఠాల అవసరం ఉన్నా…నేర్చుకోవాలన్న బలవంతం లేకపోవడం వల్ల బహుశా యూనివర్సిటీ కూడా పాఠశాల కాదు. ఎల్ కే జి నుండి పది వరకు, లేదా పదకొండు పన్నెండు కలిసి ఉంటే అంతవరకు ఉన్నది మాత్రమే పాఠశాల. అదే కన్నడలో పాఠశాలె. ఇందులో చివరి మాట “శాలా” లేదా “శాలె” అనే జనవ్యవహారంలో వాడుక.

కర్ణాటక రాజధాని బెంగళూరులో బిషప్ కాటన్ బడిలో సీటు దొరకడం అంటే రాజ్యసభలో సీటు దొరికినట్లే. బిషప్ కాటన్ విద్యార్థి అంటే స్వర్గం నుండి భూమ్మీదికి ఊడి పడ్డట్టే. సంపన్నులు, అతి బలవంతులు, అత్యంత పెద్దవారి పిల్లలు మాత్రమే చేరే బడి. అందులో చదువులు ఎలా ఉంటాయో కానీ…అక్కడి పిల్లల కథలు కర్ణాటక అంతా కథలు కథలుగా దశాబ్దాలుగా వినపడుతూనే ఉన్నాయి. తాజాగా ఆ కథలను బిషప్ కాటన్ బడి గోడ దాటి ప్రపంచం చెవులు వింటున్నాయి. కళ్లు చూస్తున్నాయి.

School Girls Street Fight

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ప్రకారం…బెంగళూరు బిషప్ కాటన్ బడి ముందు రోడ్డు మీద రెండు స్కూళ్ల అమ్మాయిలు పరస్పరం జుట్లు పట్టుకున్నారు. ఈడ్చుకున్నారు. తన్నుకున్నారు. కొట్టుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో కసితీరా కర్రలు తీసి దాడులకు దిగారు. ఇందులో బిషప్ కాటన్ అమ్మాయిలున్నారా? బిషప్ కాటన్ కు సంబంధమే లేని రెండు వేరు వేరు బృందాలవారు బిషప్ కాటన్ గేటు ముందు కత్తులు దూసుకున్నారా? లాంటి చిల్లర విషయాలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.

స్కూలు పిల్లల ప్రేమ వ్యవహారమే ఈ నడిరోడ్డు అనాగరిక యుద్ధానికి కారణమన్న విషయంలో మాత్రం బెంగళూరు నగరానికి రెండో అభిప్రాయం లేదు. స్కూల్ యూనిఫామ్ లో చక్కగా, చిక్కగా దొరకబుచ్చుకుని, జుట్లు లాక్కుని కొట్టుకుంటున్న ఈ అమ్మాయిలు మహా అయితే ఎనిమిదో క్లాసు నుండి పదో క్లాసు లోపు వారిలా ఉన్నారు.

ఈ వీడియోతో- అమ్మాయిలను అతి సుకుమారంగా పెంచి పాడు చేస్తున్నారన్న నింద నుండి ఆధునిక మహానగర సమాజం బయటపడగలిగింది. ముక్కు పచ్చలారని ఈ అమ్మాయిల చేతికి ఆ సమయంలో మారణాయుధాలే కనుక దొరికి ఉంటే…కనీసం ఇరవై మంది అమ్మాయిల గొంతులు కస కస తెగి బిషప్ కాటన్ గోడ ముందు కాటన్ బట్టల్లో ప్రాణం లేనివిగా మిగిలి ఉండేవి.

విడి విడిగా ప్రేమలో, యుద్ధంలో ఏదయినా ఓకే. అలాంటిది కలివిడిగా ప్రేమ యుద్ధంలో ఇంకేదయినా ఒకే.

యుగధర్మం ప్రకారం-
ఎనిమిదికి అష్టకష్టాల ప్రేమ ఏమిటి?
తొమ్మిదికి నవమాసాలు ఏమిటి?
పదికి పదికాలాలు ఆవిరి ఏమిటి?
అన్నవి అర్థం లేని ప్రశ్నలు.

స్కూళ్లల్లో, కాలేజీల్లో చూడకూడని, వినకూడని గబ్బు నిజం. సిగరెట్ల పొగ నిజం. మాదక ద్రవ్యాల మత్తు నిజం. డబ్బున్నవారి స్కూళ్ళు, కాలేజీల్లో ఈ జాడ్యం పిండికొద్దీ రొట్టెలా మరింత ఎక్కువ స్టఫ్/మాల్/సరుకు నిజం.

మన మహా నగరాల్లో అంతర్జాతీయ స్థాయి స్కూళ్లలో ఎలాంటి మాదకద్రవ్యాలయినా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉన్నట్లు ఈమధ్య లెక్కలేనన్ని రుజువులు చూశాము. బిషప్ కాటన్ స్కూల్ లోపలి కథలు బెంగళూరుకు తెలియనివి కావు.

పాఠశాల ప్రేమలు నిజం. ప్రేమను నిరాకరిస్తే యాసిడ్లు, బ్లేడ్ కోతలు నిజం. ప్రేమలు దక్కకపోతే యుద్ధాలు నిజం.

కన్నడ భాషలో ఒక ఫేమస్ నీతి వాక్యం ఉంది.
సకల యుద్ధాలకు మూడే కారణాలు. అవి-
“హెణ్ణు(స్త్రీ)
హొణ్ణు(బంగారం/సంపద)
మణ్ణు(మట్టి/భూమి)”

ఎన్ని శతాబ్దాల క్రితమో ఏ కన్నడ మహానుభావుడు “హె- హొ- మ” ను సూత్రీకరించాడో కానీ…ఇక్కడ హెణ్ణు(స్త్రీ)కాదు. హుడుగి (అమ్మాయి). రోజులు మారాయి. అప్పుడు హెణ్ణు కోసం. ఇప్పుడు హుడుగి కోసం. నేటి హుడుగి రేపటికి ఎలాగూ హెణ్ణు.

అన్నట్లు-
“విద్యా దదాతి వినయం ౹
వినయా ద్యాతి పాత్రతాం ౹
పాత్రత్వా ద్ధన మాప్నోతి ౹
ధనా ద్ధర్మం తత స్సుఖమ్ ౹౹”

School Girls Street Fight

అని వెనకటికి ఒక నీతి శ్లోకం. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం ఒక స్థానాన్ని ఇస్తుంది. ఆ స్థానం ధనాన్ని ఇస్తుంది. ఆ ధనం వల్ల ధర్మం, ఆ ధర్మం వల్ల సుఖం దక్కుతాయి. ఇందులో చదువు ద్వారా సిద్ధించాల్సిన మొట్టమొదటి ప్రయోజనం వినయం.

బిషప్ కాటన్ లాంటి స్కూళ్ల గోడల మీద ఈ శ్లోకాన్ని శిలాక్షరాలుగా చెక్కి అర్థ తాత్పర్యాలను కూడా తాటికాయంత అక్షరాలతో లిఖించాలి.

లిఖించినా ప్రయోజనం ఉండదు అనుకుంటే- ఈ శ్లోకాన్ని ట్రూ స్పిరిట్లో క్రమాలంకారంలో కాకుండా…రివర్స్ లో అన్వయించుకోవచ్చు.

ఇందులో యూనిఫామ్ యుద్ధవిద్యల అమ్మాయిల సుఖం ధనంలో ఉంది. ఆ ధనం ముందు ధర్మం గుడ్డిదయ్యింది. ఆ ధర్మ అంధత్వం ముందు పాత్రత చెవిటిదయ్యింది. ఆ చెవుడు ముందు వినయానికి వైకల్యం వచ్చింది. ఆ వైకల్యం వల్ల విద్య కుంటిదయి రోడ్డున పడింది. ఇదొక ఆధునిక అవిద్య. అవినయం. అపాత్రత. దుర్ధనం. కుధర్మం. కుసంస్కృతి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఇచ్చిపుచ్చుకోవడం- శ్రమైక జీవనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com