AP Job Calendar 2021 – 22 :
ఓటుకు నోటు కేసు కోసం, లేని ప్యాకేజీ కోసం గత పాలకులు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని జగన్ వెల్లడించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి గట్టిగా ఒత్తిడి తీసుకురాలేక పోతున్నామని, కానీ పరిస్థితుల్లో మార్పులు వస్తాయని నమ్మకంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో గత ప్రభుత్వ పెద్దలు రెండు మంత్రి పదవులు అనుభవించారని, అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడటం వల్ల ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా కోసం అభ్యర్ధించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2021-22 ఆర్ధిక సంవత్సరానికి వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాల క్యాలెండర్ ను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 10, 143 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జులైలో 1,238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తారు. ఆగస్టులో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు 36 భర్తీ చేస్తామన్నారు.
CM Jagan Released AP Job Calendar For The Financial Year – 2021-22 :
ఎలాంటి పైరవీలకు, సిఫార్సులకు, అవినీతికి, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే, ఎలాంటి ఇంటర్వ్యూ లకు అవకాశం లేకుండా ఈ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేలాది ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని జగన్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే 1 లక్షా 22 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగాలిగామన్నారు. మరో రెండున్నర లక్షల మందిని వాలంటీర్లుగా నియమించి గౌరవ వేతనం అందిస్తున్నామని చెప్పారు. రెండేళ్ళ కాలంలో 6,03, 756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగామని సగర్వంగా చెప్పగలుగుతామన్నారు. వీటిలో 1,84, 264 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన ఇచ్చామన్నారు. కరోనా నేపధ్యంలో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాల అమలు ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు.
వైద్య శాఖలో పారా మెడికల్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ లకు సంబంధించి 5,251పోస్టులు నవంబర్లో, విద్య శాఖలో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2020 ఫిబ్రవరిలో భర్తీ చేస్తామని జగన్ వివరించారు.
కాగా, ముఖ్యమంత్రి విడుదల చేసిన క్యాలెండర్ లో పేర్కొన్న 10,143 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ వెనువెంటనే అనుమతి మంజూరు చేసింది. ఎపిపీఎస్సీ, డిఎస్సీ, పోలీస్ నియామక బోర్డుకు ఈ మేరకు మజూరు పత్రం జారీ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని పేర్కొంది.
Also Read : తెలంగాణా హైకోర్టు జడ్జిల సంఖ్య పెంపు