కరోనాతో సహా ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కునేందుకు ఇండియా సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్వాడ్ వేదికగా జపాన్లో ప్రకటించారు. చైనా అంశమే అజెండాగా సాగిన క్వాడ్ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ భారత వైఖరి స్పష్టం చేశారు. కరోనా అంశంపై మాట్లాడినా నర్మగర్భంగా చైనా వైఖరిని మోడీ తూర్పుర పట్టారు. తైవాన్ కు చైనా నష్టం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని అమెరికా ప్రకటించగా క్వాడ్ సదస్సు సమర్థించింది. కరోనా సమయంలో వంద దేశాలకు ఇండియా టీకా సరఫరా చేసిందని మోడీ వెల్లడించారు.
క్వాడ్(QUAD) శిఖరాగ్ర సదస్సులో పాల్లొనేందుకు జపాన్ వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలను కలిశారు. జపాన్ కు చెందిన 40 కంపెనీల సిఈఓ లతో మోడీ భేటి అయ్యారు. పెట్టుబడులు, సాంకేతికత నుండి వస్త్రాలు, సంస్కరణల నుండి స్టార్టప్‌ల వరకు విభిన్న అంశాలపై చర్చించారు. భారతదేశం పట్ల గొప్ప ఉత్సాహం ఉందని, భారత యువత వ్యవస్థాపక నైపుణ్యాల పట్ల గొప్ప ప్రశంసలు వచ్చాయని మోదీ పేర్కొన్నారు.
కాగా,మోదీతో సమావేశమైన వారిలో సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మరియు CEO మసయోషి సన్ కూడా ఉన్నారు. భారతీయ సాంకేతికత, ఇంధనం, ఫైనాన్స్ మరియు R&D రంగాలలో జపాన్ పెట్టుబడి సంస్థ భవిష్యత్తు భాగస్వామ్యం గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మరియు CEO మసయోషి సన్‌తో సమావేశమయ్యారు.
టోక్యోలో ప్రవాస భారతీయులతో సమావేశమైన మోడీ దేశ ప్రతిష్ట కాపాడే విధంగా ప్రవాస భారతీయుల నడవడిక ఉండాలని కోరారు.