కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో యువత ర్యాలీ ఈ రోజు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేని కారణంగా ర్యాలీని అడ్డుకున్న పోలీసుల పై రాళ్లు రువ్విన నిరసనకారులు. డిఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ గన్ మ్యాన్ కు గాయాలు కాగా నిరసనకారులను లాఠీఛార్జ్ తో చెదరగొట్టిన పోలీసులు. మరోవైపు కలక్టరేట్ ముట్టడికి సిద్ధం అయిన కోనసీమ జిల్లా మద్దతు దారులు. జై కోనసీమ నినాదాలతో కలెక్టరేట్ వైపు వెళ్తున్న యువత… రెండు వర్గాల కార్యక్రమాలతో కోనసీమ అట్టుడుకుతోంది.
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం వివాదానికి కారణమయింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. జిల్లా పేరు మార్పుకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేజారకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లా పేరు మార్పుపై వివిధ వర్గాల నుంచి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కాట్రేనికోన, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన్ విధించినట్టు చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎవరూ కూడా బహిరంగసభలు, ర్యాలీలు, నిరసనలు నిర్వహించకూడదని శాంతిభద్రతలను అదుపులో ఉంచడం కోసం 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
Also Read : మన్యంలో మరో కొత్త జిల్లా: పేర్ని వెల్లడి