Tuesday, April 16, 2024
HomeTrending Newsతెలంగాణకు అలియాక్సిస్

తెలంగాణకు అలియాక్సిస్

రెండో రోజు దావోస్లో తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. తాజాగా ఆశీర్వాద్ పైప్స్ (aliaxis) గ్రూప్ తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు సమక్షంలో దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో అవగాహన ఒప్పందం జరిగింది. అలియాక్సిస్ కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్ మంత్రి కే. తారకరామారావు తో సమావేశం అయ్యారు. తాము పెట్టనున్న పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా స్టోరేజ్ మరియు డిస్ట్రిబ్యూషన్ పైల్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ సీఈవో తెలిపారు. కేవలం దేశీయ మార్కెట్ల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇతర దేశాల కోసం సైతం తెలంగాణ నుంచి తయారుచేయడమే లక్ష్యంగా తమ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు

తెలంగాణలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆశీర్వాద్ పైప్స్ కు మంత్రి కే తారకరామారావు ఆహ్వానం పలికారు. కంపెనీ ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఈ రోజు ఆశీర్వాద్ పైప్స్ పెట్టుబడి ద్వారా ఈ రంగంలో మరిన్ని ఉత్పత్తులు పెట్టుబడులు తెలంగాణకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేస్తున్న తయారీ ప్లాంట్ కోసం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఆదిత్య థాకరే

మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్ ను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్ మరియు పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం వంటి కీలకమైన సంస్కరణలను కేటీఆర్ ఆదిత్య థాకరేకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వస్తానని ఆదిత్య థాకరే తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పట్టణ అభివృద్ధిలో చేపట్టిన పలు అంశాల పైన ఆదిత్య థాకరే మంత్రి కేటీఆర్ కి వివరాలు అందించారు. పరస్పరం కలిసి పని చేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్