little bit: ‘ఎఫ్ 2’ సినిమా తరువాత ఆ స్థాయి కామెడీ ఎంటర్టైనర్ రాలేదనే చెప్పాలి. భార్యల వేధింపులు .. సాధింపుల నేపథ్యలో సాగిన ఈ కథ ఆడియన్స్ ను నాన్ స్టాప్ గా నవ్వించింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ .. రికార్డుస్థాయిలో అది రాబట్టిన వసూళ్లను చూసిన అనిల్ రావిపూడి ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3‘ ని రూపొందించాడు. ఈ సారి ఈ కథను ఆయన డబ్బు చుట్టూ తిప్పాడు. కొత్తగా ఈ కథలోకి కామెడీ వైపు నుంచి సునీల్ ను .. అలీనీ, గ్లామర్ వైపు నుంచి సోనాల్ చౌహాన్ ను .. పూజ హెగ్డేను రంగంలోకి దింపాడు. మరికాస్త ఫన్ .. ఇంకాస్త రొమాన్స్ ను జోడించిన ఈ సినిమాను ఈ రోజునే థియేటర్లకు తీసుకుని వచ్చాడు. ఆయన జోడించిన అదనపు బలగం ఈ సినిమాకి ఏమైనా హెల్ప్ అయిందా అంటే కాలేదనే చెప్పాలి.
ఈ సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. రాజేంద్ర ప్రసాద్ .. సునీల్ .. అలీ .. తమన్నా .. మెహ్రీన్ పాత్రలన్నీ కూడా వీలైనంత త్వరగా సాధ్యమైనంత ఎక్కువ డబ్బును సంపాదించే ఆలోచన చేస్తుంటారు. ఆ దిశగానే వాళ్ల పథకాలు .. ప్రణాళికలు నడుస్తుంటాయి. అందులో భాగంగానే ఏకంగా పోలీస్ ఆఫీసర్ ఇంటికే కన్నం వేస్తారు. అది ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బే కదా అంటూ మరో పోలీస్ ఆఫీసర్ వాళ్లకి సహకరిస్తాడు. ఆ ఇంటి నుంచి తెలివిగా దబ్బబు – డైమండ్స్ కొట్టేసిన ఈ బృందం … ఆ డబ్బును పోగొట్టుకోవడమే కాకుండా, ఆ పోలీస్ ఆఫీసర్ కి విషయం తెలియడంతో రిస్క్ లో పడతారు. ఈ టీమ్ నుంచి చేజారిపోయిన డబ్బు .. డైమండ్స్ ఏమయ్యాయనేది ఇక్కడ సస్పెన్స్.
ఆ తరువాత వారసత్వ ఆస్తిపాస్తులను కొట్టేయడం కోసం ఈ టీమ్ లోని వాళ్లంతా ఒకరికి తెలియకుండా ఒకరు విజయనగరంలోని ఒక శ్రీమంతుడికి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో నుంచి పారిపోయిన తన కొడుకు కోసం 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ శ్రీమంతుడు, నేను కొడుకునంటే నేను అంటూ నలుగురు కొడుకులు రావడంతో .. ఆయన అయోమయంలో పడతాడు. అసలు కొడుకు ఎవరనేది ఇక్కడ సస్పెన్స్. ఇలా డబ్బు చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అనిల్ రావిపూడి ఈ సారి పాత్రలను పెంచేసి తెరనింపేశాడు అనిపిస్తుంది. ఆయన మార్కు డైలాగులు పెద్దగా పేలలేదు .. ఆయన మార్కు స్క్రీన్ ప్లే పండలేదు .. క్లైమాక్స్ సరిగ్గా రాసుకోలేదు. కామెడీ కంటే హడావిడి ఎక్కువ అన్నట్టుగా ఈ కథ నడుస్తుంది. కథాకథనాలు .. పాటల పరంగా చూసుకుంటే ‘ఎఫ్ 2’ తరువాత స్థానంలోనే ‘ఎఫ్ 3’ ఉంటుందనేది మాత్రం వాస్తవం.
Also Read : హీరోను అయిపోవాలనే ఆలోచన లేదు: అనిల్ రావిపూడి