Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకరెంటు వైర్లతో అసువులుబాసే పశువులు

కరెంటు వైర్లతో అసువులుబాసే పశువులు

Cows Electrocuted By Falling Power Lines :

“వినరా వినరా నరుడా!
తెలుసుకోర పామరుడా!

గోమాతను నేనేరా …నాతో సరిపోలవురా

కల్లాకపటం యెరుగని గంగీగోవును నేనూ
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను..

కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా…
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే
ఉసురు గోలుపోయి మీకే ఉపయేగిస్తున్నాను

నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయ్…
నా యెరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్..
నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్…
నా ఒళ్ళె ఢంకాలకు నాదము పుట్టించునోయ్”

గోవుల గోపన్న సినిమాకు కొసరాజు రాయగా, ఘంటసాల గానం చేసిన ఈపాటలో ఒక్కొక్క మాట ఆణిముత్యం. ఊరి అరుగు మీద పెద్దల సుద్దుల భాషలా చాలా సాధారణంగా ఉన్నా అసాధారణమయిన భావం, హితబోధ ఉన్నాయి. అందుకే అర్ధ శతాబ్దం దాటినా గోవుల మీద మళ్లీ ఇలాంటి పాట ఒకటి పుట్టలేదు.

ఇప్పటి హీరోలు గోవులు కాచే గోపన్నలు కాలేరు. కనీసం గోవులు చూసే గోపన్నలు కూడా కాలేరు కాబట్టి- ఇలాంటి గోగీతాలు రావు. రావాలని కోరుకోవడం యుగధర్మం రీత్యా నేరం కూడా.

“ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ.. నిను ఆ బ్రహ్మ?
పాలతోనా..నా.. పూలతోనా..నా..
వెన్నతోనా..నా.. జున్నుతోనా..నా..?”

ఇప్పుడు హీరోకు తెలిసిన పాలు, పెరుగు, మీగడ, వెన్న, జున్ను ఇవే. హీరో- హీరో ఇన్ల పశు ప్రేమ, పశు పోషణ, పశు గ్రాస భక్షణ అన్నిట్లో ఇలా ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది అనుకుని సరిపెట్టుకోకపోతే మనం కూడా ఆ గడ్డే తినాల్సి వస్తుంది. అయినా నానా గడ్డి కరవడం కంటే మేలయిన పశువుల గడ్డి కరవడం ఆరోగ్యరీత్యా కూడా మంచిదేమో! మనుషుల డాక్టర్లు- పశువుల డాక్టర్లు కలిసి కూర్చుని మాట్లాడుకుని తేల్చాల్సిన విషయమిది.

పల్లె పొలాల్లో ఆవులు, గేదెలు, ఎడ్లకు చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. జూన్, జులై రాగానే నైరుతి రుతుపవనాలు మొదలవుతాయి. బండలు పగిలే ఎండలు పోయి చిరు చినుకులతో చల్లగాలులు రావడం మన మనసుకు, శరీరానికి హాయిగా ఉంటుంది. పుడమి మళ్లీ పచ్చటి పట్టు చీర కట్టుకుని సస్యశ్యామల హరిత గీతాలకు గొంతు శ్రుతి చేసుకుంటుంది. పశువులకు కూడా పచ్చిక బయళ్లను చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది.

గాలి వానలకు పొలాల్లో కరెంటు స్తంభాలు ఊగిపోతాయి. కరెంటు తీగలు కింద పడతాయి. అందులో హై ఓల్టేజ్ కరెంట్ ప్రవహిస్తూనే ఉంటుంది. పచ్చి గడ్డి తింటూ తిరిగే మూగ జీవాలకు ఆ కరెంటు తీగలే యమపాశాలవుతున్నాయి. అలా పొలాల్లో పడ్డ కరెంటు తీగలు షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయిన పశువుల గురించి సాక్షి హృదయవిదారకమయిన ఫోటోతో చక్కటి వార్తను మొదటి పేజీలో ప్రచురించింది.

Cows Electrocuted :

ఒక్క తెలంగాణలోనే ఏడాది కాలంలో ఇలా కరెంటు వైర్లకు ప్రాణాలొదిలిన పశువులు దాదాపు అయిదున్నర వేలు.

దుక్కి దున్ని మధ్యాహ్నం విరామంలో కట్టిన కాడిని తీసేసి మేతకు వదిలిన ఎద్దు కరెంటు వైర్ తగిలి పొలంలోనే ప్రాణం కోల్పోతే – ఆ ఎద్దు మీద పడి విలపిస్తున్న రైతు ఫోటో చూస్తే గుండె తరుక్కుపోతుంది.

ఇంత టెక్నాలజీ పెరిగిన ఈరోజుల్లో స్తంభమో, వైరో ఊడి పడగానే కరెంటు ఆటోమేటిగ్గా ఆగిపోయేలా చేయలేమా?
ఎద్దు తొక్కని నేల- నేల కాదు.
ఆవు తొక్కని ఇల్లు- ఇల్లు కాదు.
కరెంటు వైర్లను ఇలాగే వదిలేస్తే నేల తొక్కడానికి ఎడ్లు మిగలవు. ఇల్లు తొక్కడానికి ఆవులు మిగలవు.

వినరా వినరా నరుడా!
వింటున్నావా ఓ కరెంటు వైరూ!

-పమిడికాల్వ మధుసూదన్

Must Read : హరితహారం తెలంగాణకు మణిహారం – మేయర్ విజయలక్ష్మి

RELATED ARTICLES

Most Popular

న్యూస్