జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు చేపడతారనే ఫ్రస్ట్రేషన్ లో లోకేష్ ఉన్నాడని రాష్ట్ర రవాణా, సమాచార-పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీని జూనియర్ లాగేస్తాడని భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ గడ్డం పెంచినంత మాత్రాన గబ్బర్ సింగ్ కాలేరని, బూతులు తిట్టినంత మాత్రాన నాయకుడు కాలేదని వ్యాఖ్యానించారు. లోకేష్ ను చూసి జాలిపడడం తప్ప ఏమీ చేయలేమన్నారు.
మనిషిననే విచక్షణ కోల్పోయి, అసభ్యంగా, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇది సరికాదని, మేము లోకేష్ ని అనలేమా అని నాని ప్రశ్నించారు. తెలుగుదేశం రాజకీయ వ్యూహకర్త రాబిన్ సింగ్ బహుశా ఇలాంటి సలహాలు ఇస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దమ్ముంటే కేసులు పెట్టుకోవాలంటూ లోకేష్ సవాల్ చేస్తారని, కానీ కేసు పెట్టగానే అన్యాయంగా పెట్టారని కాకి గోల చేస్తారని దుయ్యబట్టారు.
లోకేష్ పెద్ద రాజకీయ నిరుద్యోగిగా మారిపోయారని, సీతానగరం ఘటనపై కూడా రాజకీయం చేయాలని లోకేష్ చూడడం హేయమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. బాధితులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆడపిల్లల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అయినా సరే మానవ రూపంలో మృగాలు ఇలాంటి సంఘటనలకు పాల్పడడం హేయమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సాధించిందని, 13.74 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశామని, దేశమంతా ఏపి వైపు చూసిందని మంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల అధికారులు మనల్ని సంప్రదిస్తున్నారని, వ్యాక్సిన్లపై విమర్శలు చేసేవారికి ఇది చెంప పెట్టు లాంటిదన్నారు. జాబ్ క్యాలెండర్ పై విపక్షాల ఉచ్చులో పడవద్దని యువతకు మంత్రి హితవు పలికారు. చెప్పిన ప్రతి మాటకూ కట్టుబడి ఉండే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని, రాబోయే మూడేళ్ళలో తప్పకుండా యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు.